వెస్ట్ సిటీ తరహాలో విస్తరించేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్న నార్త్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డు పెడుతోంది. నగరంలో ఆఫర్డబులిటీ, డ్యూరాబులిటీ ఉన్న, వృద్ధి సామర్థ్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిలిచి నార్త్ సిటీకి.. కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న చర్యలతో పురోగతి తలకిందులవుతోంది.
వెస్ట్ కారిడార్‌తో పోలిస్తే నార్త్ సిటీ వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఆ ప్రాంతంలో చేపడుతున్న మౌలిక వసతులే కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంత అభివృద్ధిలో జరుగుతున్న నిర్లక్ష్యమే కారణమని, ఎలివేటెడ్ కారిడార్, నార్త్ సిటీ మెట్రో, జాతీయ రహదారులు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని తేలింది. గడిచిన కాలంలో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో సర్కార్ తీసుకునే నిర్ణయాలతో ప్రభావితం అవుతున్నట్లు చెబుతున్నారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరావృద్ధిలో వెనుకబడి పోయింది. ఇదే సమయంలో మెట్రో విస్తరణ స్తంభించడం, మూసీ పేరిట, హైడ్రా కూల్చివేతలతో రియాల్టీలో ఇతర మెట్రో నగరాలకు పోటీలో లేకుండా పోయాం. ఈ క్రమంలో సర్కార్ చేపడుతున్న ప్రభుత్వపరమైన విధానాలు… అత్యంత ప్రతికూలంగా మారినట్లుగా తేలింది. అయితే సిటీలో విపరీతంగా పెరిగిన ధరలతో.. వెస్ట్ సిటీ కంటే ఎక్కువ మంది ఈ ప్రాంతానికి మొగ్గుచూపుతున్నారు. కానీ ఇక్కడ మౌలిక వసతుల కల్పన అత్యంత సమస్యగా మారడంతో… గ్రోత్ రేట్ విషయంలో నార్త్ సిటీ వెనుకబడి పోతుందని స్పష్టమవుతున్నది.
ప్రధానమైన ఈస్ట్, వెస్ట్ కారిడార్‌తో పోలిస్తే నార్త్ సిటీలో వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి మౌలిక వసతుల కల్పనపై సర్కార్ వద్ద లోపించిన నిర్మాణాత్మక ప్రణాళికలే కారణమని తెలుస్తోంది. హడావుడిగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వివాదాలు ఓవైపు సాగుతుండగా.. ఇప్పటికీ అనుమతులకు నోచుకోలేని నార్త్ సిటీ మెట్రో కారిడార్ మరోవైపు మొత్తానికి ఆ ప్రాంతానికి మాయని మచ్చగా మార్చివేశాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల దేవుడెరుగు, పాత ప్రాజెక్టులను పూర్తి చేసి, మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రియాల్టీ సంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. దీనికి తోడు నగరంలో పడిపోయిన రియాల్టీ క్రయవిక్రయాలు, 22ఏ నిషేధిత జాబితా వంటి అంశాలు కూడా ఇక్కడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన ఐదేండ్లలో కొంపల్లి వృద్ధి రేటు క్రమంగా పెరుగుతున్న జనావాసాలకు అనువైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇదే సమయంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారిని పూర్తి చేసి అందుబాటులోకి రాలేదు. ఇక బీఆర్ఎస్ హయాంలో చేపట్టినకండ్లకోయ ఐటీ పార్క్‌పై నీలిమేఘాలు కమ్ముకోవడంతో ఇక్కడి అభివృద్ధిని డోలాయమానంలో పడేసింది.
గత దశాబ్దకాలంలో 100 శాతం క్యాపిటల్ అప్రియేషన్ సాధించిన నార్త్ సిటీ, ప్రస్తుతం 12.5శాతానికి మించి పెట్టుబడిపై రాబడి రానీ పరిస్థితికి దిగజారింది. దీనికి కొలిక్కిరాని నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టు, వివాదస్పదంగా మారిన ఎలివేటెడ్ కారిడార్, అధికారంలోకి రావడంతోనే ఐటీ పార్క్‌ను ప్రశ్నార్థకంగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నార్త్ సిటీ రియాల్టీపై ప్రభావం చూపుతున్నాయని లిస్ట్ ఇట్ నౌ నివేదికలో తేలింది. అదేవిధంగా శరవేగంగా విస్తరించే జీనోమ్ వ్యాలీకి కనెక్టివిటీ ప్రాజెక్టులలో వేగం తగ్గడం కూడా రియల్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ అద్దెలపై వచ్చే ఆదాయం కూడా 3.-4లోపే ఉందనీ, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు కూడా ఇటువైపు స్థిరాస్తులు అంటే అనాసక్తి వ్యక్తం చేస్తున్నారని నివేదిక పేర్కొంది.