శామీర్‌పేట, జూలై 23: ఆర్టీఏ, మైనింగ్ అధికారినంటూ ఓ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు, అతడి సహచరులు హల్చల్ చేశారు. కారులో సైరన్ వేసుకుని రోడ్డుపై వెళ్తున్న వాహనాదారులను వెంబడించి వేధింపులకు గురిచేస్తూ ఎదిరిస్తే దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపూర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
ఉప్పర్‌పల్లి రామకృష్ణకు చెందిన టిప్పర్ లారీని దత్తాయిపల్లి వైపు వెళ్లేందుకు డ్రైవర్ రామాంజనేయులు, క్లీనర్ షాబాజ్‌తో కలిసి రాత్రి వెళ్తున్నారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్‌కు చేరుకోగానే పోలీస్ సైరన్‌తో కూడిన కారులో వెంబడించి అడ్డుకున్నారు. దీతో లారీని లక్ష్మాపూర్ ఎల్లమ్మగుడి సమీపంలో రోడ్డుపై ఆపారు. వెంటనే కారులో వచ్చిన కొందరు తాము ఆర్టీఏ, మైనింగ్ అధికారులమని చెబుతూ తమ వెంట తెచ్చుకున్న కర్రలతో టిప్పర్‌ను కొడుతూ కిందికి దిగాలని, మాకు డబ్బులు కట్టాలని, ఇవ్వకుంటే ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేదే లేదని బెదిరించారు.
దీంతో డ్రైవర్ రామాంజనేయులు యజమాని రామకృష్ణకు సమాచారం అందించాడు. అతను లక్ష్మాపూర్‌లో ఉండే తన బావమరిది అనిల్‌కు సమాచారం ఇచ్చి తాను వచ్చాడు. కారులో వచ్చిన వారిని లక్ష్మాపూర్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కీసరి భానుచందర్, అతడి తమ్ముడు కీసరి వేణు, సహచరుడు మేడమైన రాజులుగా గుర్తించాడు. నేను ఆర్టీఏ అధికారిని, నేను ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ పీఏను, గల్లీ లీడర్ల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వరకు తనకు పరిచయాలు ఉన్నాయని, తన బలగం, హోదా నీకేం తెలుసు అంటూ దాడికి పాల్పడ్డాడు.
నర్సింలుయాదవ్ నన్ను డబ్బులు వసూళ్లు చేయమని చెప్పాడని అంటూ టిప్పర్‌లారీ డ్రైవర్ రామాంజనేయులుపై దాడి చేయగా.. అడ్డొచ్చిన అనిల్‌పై పిడిగుద్దులతో దాడి చేసి లారీ తాళాలు లాక్కున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న టిప్పర్ యజమాని రామకృష్ణపై కూడా దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.