కుత్బుల్లాపూర్, మార్చి 27: అసెంబ్లీ బడ్జెట్ 2025 – 26 సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, అనుభవలేమితో ప్రజలు అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వారిని కాపాడుతూ అసెంబ్లీ లోపల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దోస్తీపై బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిప్పులు చెరిగారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ కాంగ్రెస్‌ల తీరును తీవ్రంగా ఖండించారు. బీజేపీ, కాంగ్రెస్ మొదటి నుంచి గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆపద వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు రక్షణగా నిలుస్తున్నారని, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్,బీజేపీ బంధం బయటపడిందని, నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ ఎమ్మెల్యేకు స్కిప్ట్రు రాసి ఇచ్చారన్నారు. ఇరిగేషన్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక బీజేపీకి స్కిప్ట్రు ఇచ్చారని, కాంగ్రెస్ రాసి ఇచ్చిన స్కిప్ట్రును బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చదువుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని , ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇస్తామని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.