సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో ఆదర్శంగా నిలిచిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోంది. రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం దిశగా అడుగులు పడుతున్నాయి. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణను గాలికి వదిలేయడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు ఛిద్రమవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్ల పక్క ఫుట్‌పాత్‌లు, రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనులతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీ, బస్తీ రోడ్లే కాదు ప్రధాన రహదారులైన సీఆర్ఎంపీ రోడ్ల మీదకి వెళ్లాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఎకడ ఏ గోతిలో పడి ప్రమాదానికి గురవుతామోనన్న ఆందోళన నిత్యం వెంటాడుతోంది. సీఆర్ఎంపీ కింద నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణను మెరుగుపరుస్తామని ప్రకటించిన గొప్పలు.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి పూర్తిగా నీరుగారిపోయాయి.
సీఆర్ఎంపీ రోడ్లకు సంబంధించిన ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను పట్టాలెకించడంలో అధికారులు పూర్తి గా విఫలమయ్యారు. ప్రతిపాదనలు సిద్ధం చేయడం, టెండర్లు పిలవడం, కాంట్రాక్టులు ఖరారు చేయడంలో నెలల తరబడి కాలయాపన జరుగుతోంది. గడిచిన 2 నెలల క్రితం ట్రై కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలోని రహదారుల నిర్వహణ, పునరుద్ధరణకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) ఫేజ్-2 కింద రూ.3,145 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో నం 591ను జారీ చేశారు. ట్రై కార్పొరేషన్లకు సంబంధించి ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోరూ.1,533, ఎంఎంసీ రూ.818, సీఎంసీ రూ.794 కోట్లుగా కేటాయించారు. ఐతే నేటికీ టెండర్ దశ పూర్తి చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
రోడ్లపై గుంతలు పడకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, రోడ్లపై చెత్తను తొలగించడానికి మెకానికల్ స్వీపింగ్ యంత్రాలు, ట్రాఫిక్ భద్రత కోసం లేన్ మారింగ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్ల నిర్వహణ బాధ్యతలను కూడా టెండర్ దకించుకునే ఏజెన్సీ చూసుకోవాల్సి ఉంది. ఐతే టెండర్ దశలో రోజుల తరబడి ఉండటం.. మరోవైపు వర్షాలకు రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కష్టాలకు తోడు గుంతల రోడ్లు తోడవ్వడంతో నగరవాసుల రోజువారీ ప్రయాణం నరకంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి టెండర్ల ప్రక్రియను ముగించి, యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కొండాపూర్, ఆగస్టు 23: చందానగర్ గౌతమీనగర్ కాలనీలో రోడ్డు పనుల పేరుతో కంకర, నిర్మాణ సామగ్రిని రోడ్డుపైనే కుప్పలుగా వేయడంతోపాటు కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. రోడ్డు పనుల కోసం వేసిన కంకరపై జారిపడి తీవ్రంగా గాయపడిన ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు (50), చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం శ్రీనివాసరావు.. గౌతమీనగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై ఉన్న కంకరమీద జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అకడికకడే సృ్పహ కోల్పోగా.. కాలనీవాసుల ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది శ్రీనివాసరావును కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు.
గౌతమీనగర్ కాలనీలో 6నెలల క్రితం రోడ్డుపనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్లను తవ్వి.. కంకర, మెటీరియల్‌ను రోడ్డుపైనే కుప్పలుగా పోసి పనులను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో అప్పటినుంచి స్థానికులకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. తాజాగా కంకరమీద కాలుజారిపడి ఓ వ్యక్తి చనిపోవడంతో.. సదరు కాంట్రాక్టర్, పనులను పర్యవేక్షించాల్సిన అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు