సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా.. ఏకపక్షంగా డివిజన్లను మార్చడంతో సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖానీ చేస్తున్నదని మండిపడుతున్నారు. జనాభా ప్రమాణాలు.. భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి.. కేవలం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రక్రియ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు సమయం ఇవ్వగా, పునర్విభజన లోపాలను ఎత్తిచూపుతూ.. ఇప్పటికే 1500లకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. కాగా, సోమవారం తలసాని నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం బల్దియా కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ రూల్స్‌కు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. ప్రజల ప్రయోజనాలను కేంద్రీకరించి మాత్రమే వార్డుల పునర్విభజన జరగాలని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే కోర్టు తలుపులు తట్టడం ఖాయమని హెచ్చరించింది.
జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన అంశం భగ్గుమంటున్నది. 300 డివిజన్లను ఖరారు చేసి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి వారం రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వాలని కమిషనర్ ఉత్తర్వు జారీ చేయగా, ఈ నెల 10వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, జోనల్ కార్యాలయానికి అభ్యంతరాలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే 1500లకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం డీ లిమిటేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో రోజంతా పోటెత్తారు. వార్డుల విభజన ఏ మాత్రం శాస్త్రీయంగా, నిబంధనల మేరకు జరగలేదని, అధికార యంత్రాంగం ఇష్టానుసారం వ్యవహరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని నేతలు మండిపడ్డారు. తమ అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచి వార్డుల విభజన పారదర్శకత పాటించలేదంటూ మండిపడుతున్నది.
ఒక స్పష్టమైన విధానం లేకుండా డీలిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీలో డివిజన్లను ఇష్టమొచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటులో జరిగిన తప్పిదాలపై తలసాని ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళంగా ఉందని ఆయనకు వివరించారు. 1996లోని రూల్ 8 తప్పనిసరి నిబంధనలను కమిషనర్ పాటించలేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా వార్డు మ్యాప్‌లు, జనాభా వివరాలు, సరిహద్దు వివరాలను తెలియజేయలేదని విమర్శించారు.
కార్పొరేటర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడానికే మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బీఆర్ఎస్ బృందానికి వివరించారు.ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటులో జరిగిన తప్పిదాలపై తలసాని ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళంగా ఉందని ఆయనకు వివరించారు. 1996లోని రూల్ 8 తప్పనిసరి నిబంధనలను కమిషనర్ పాటించలేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా వార్డు మ్యాప్‌లు, జనాభా వివరాలు, సరిహద్దు వివరాలను తెలియజేయలేదని విమర్శించారు. కార్పొరేటర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడానికే మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బీఆర్ఎస్ బృందానికి వివరించారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత పాలన, ప్రజాపాలన అని చెప్పి పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన చేపట్టింది. కాంగ్రెస్‌కు పట్టులేదు కాబట్టే బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి డీ లిమిటేషన్ చేసినట్టుగా ఉంది. జనాభా ప్రమాణాలు, భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి, ఇష్టానుసారంగా వార్డుల సంఖ్య పెంచడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఘోర దాడి. జీహెచ్ఎంసీ యాక్ట్‌తో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు ప్రజాబలం, పట్టు లేకపోవడంతో బ్యాక్‌డోర్ రాజకీయాల ద్వారా కార్పొరేషన్‌ను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు పాల్పడ్డారు. రాజ్యాంగబద్ధమైన విధానాలు పాటించకపోతే తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ తీసుకునే ఏ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అంగీకరించదు. జీహెచ్ఎంసీ రూల్స్‌కు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ప్రజల ప్రయోజనాలను కేంద్రీకరించి మాత్రమే వార్డుల పునర్విభజన జరగాలి. సాంకేతికపరమైన అంశాలను పట్టించుకోలేదు. రాజ్యాంగ బద్ధంగా వెళ్తారా? రాచరికంగా వెళ్తారా అని కమిషనర్‌ను అడిగాం. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే కోర్టు తలుపులు తట్టడం ఖాయం.
– డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ అభివృద్ధి గణనీయంగా జరిగింది. మేడ్చల్‌లో 400 మంది కౌన్సిలర్లు ఉన్న పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం 16 కార్పొరేటర్లకు తీసుకొచ్చింది. ఈ విస్తరణలో టాక్స్‌లు పెరిగి ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. జీహెచ్ంసీలో విలీనం చేసిన మున్సిపాలిటీలల పరిధిలో ఏర్పాటు చేసిన వార్డుల విభజన సరిగా లేదు. వార్డుల ఏర్పాటులో ప్రజాప్రతినిధుల, ప్రజల అభిప్రాయలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వార్డుల విభజన చేయాలి. ఇష్టం ఉన్న రీతిలో వార్డుల విభజన, వార్డుల ఏర్పాటుపై ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
– మల్లారెడ్డి , మాజీ మంత్రి, ఎమ్మెల్యే