సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్లు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసిన కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలను మోసం చేసింది. మరోవైపు మైనార్టీల శ్మశానవాటికకు ఎక్కడ స్థలం కేటాయించినా అడ్డుకుంటామంటూ బీజేపీ డ్రామాలు మొదలుపెట్టింది. ఉప ఎన్నికలు సమీస్తుండగా ఈ రెండు పార్టీలు ఒకరిని మించి మరొకరు నాటకాలకు తెర తీశాయి. మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీల తీరు ‘మీరివ్వండి.. మేం అడ్డుకుంటాం’ అన్న తీరుగా మారింది. రెండు జాతీయ పార్టీలు తోడుదొంగల్లా మారి జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపయోగపడని స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటిస్తే.. శ్మశానవాటిక స్థలానికి మతం రంగు పులిమి రాజకీయం చేయాలని బీజేపీ భావిస్తున్నది.
షేక్‌పేటలోని ఆర్మీ స్థలం ముస్లింల శ్మశానవాటికకు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌కు భంగపాటు కలిగింది. దీంతో ఎర్రగడ్డ సర్వే నంబర్ 81, 82లోని 7,111 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వక్ఫ్‌బోర్డు నిర్ణయించినట్లు ప్రచారం చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు బ్రిగేడ్, కల్పత రు అపార్ట్మెంట్ల మ ధ్యన సంబంధిత స్థలం గోడను కూల్చారు. దీంతో ఆపార్ట్మెంట్ల నివాసితులు ఆ స్థలంలోకి వెళ్లేందుకు దారిలేదని, ఇప్పుడున్న దారి తమకు చెందినదని ధర్నాకు దిగారు. ఇదే విషయాన్ని బాలానగర్ తహసీల్దార్‌ను అడగగా స్థలం వక్ఫ్‌బోర్డు పరిధిలోనే ఉంది కానీ.. దారి విషయం తమకు తెలియదని స్పష్టం చేశారు. ఆ స్థలాన్ని 45 ఏండ్ల క్రితమే శ్మశానవాటికకు కేటాయించారని అది వివాదంలో ఉండటం వల్ల పడావుపడి ఉన్నదని స్థానికులు చెప్తున్నారు.
మరోవైపు నూర్ ఫంక్షన్ హాల్‌ను ఆనుకొని ఉన్న ఓ దారి ఆ స్థలానికి చెందినదేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఆ దారి తమదేనని దశాబ్దం కిందటే నూర్ ఫంక్షన్ హాల్ యజమానులు కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హడావుడిగా దారి లేని స్థలాన్ని కేటాయించి మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేసిందని ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన రెండు ప్రాంతాల స్థలాలూ వివాదంలోనే ఉండటంతో కాంగ్రెస్ దుర్బుద్ధి బయటపడిందని మండిపడుతున్నారు. ఓట్ల కోసం మైనార్టీలను మోసం చేయడానికి ప్రయత్నించిందని అసహనం వ్యక్తం
చేస్తున్నారు.
దారిలేని, వివాదంలో ఉన్న స్థలాన్ని కేటాయించిదని తెలిసినా కాంగ్రెస్‌ను రక్షించేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఆ స్థలాన్ని మైనార్టీలకు అప్పగించాలని చూస్తే అడ్డంగా పడుకుని ఆపుతామని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు ప్రకటించారు. మొత్తం వ్యవహారానికి మతం రంగు పులిమి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ముస్లింలు మాత్రం ఆ స్థలంలో తమకు శ్మశానవాటిక అవసరం లేదని, మరో ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బడేభాయ్, చోటేభాయ్ చీకటి దోస్తీలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
మొత్తం ఎపిసోడ్‌తో కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్ల పక్కన శ్మశానవాటిక వద్దు: బిగ్రేడ్, కల్పతరు నివాసితులు తమ నివాసాల పక్కన ఉన్న స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయించొద్దని బ్రిగేడ్, కల్పతరు అపార్ట్మెంట్ వాసులు ధర్నాకు దిగారు. ఆ స్థలంలోకి వెళ్లేందుకు అసలు దారిలేదని, ఉన్న దారి తమదేనని అంటున్నారు. తమ రెండు అపార్ట్మెంట్ల మధ్య ఉన్న స్థలాన్ని వివాదస్పద స్థలానికి దారిగా చూపడం సరికాదన్నారు. అడ్డుగా ఉన్న గోడను కూల్చి తమ దారి నుంచి వెళ్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. నిర్మాణంలో భాగంగానే రెండు అపార్ట్మెంట్లకు మధ్య ఖాళీ స్థలం ఉంచామని, అది పూర్తిగా తమదేనని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దారిలేని, వివాదస్పద స్థలంలో తమకు శ్మశానవాటిక అవసరం లేదని ముస్లిం ప్రతినిధులు తేల్చి చెప్తున్నారు. ఇక్కడ శ్మశానానికి స్థలం కేటాయించినా జూబ్లీహిల్స్ ముస్లింలు తీసుకోబోరని స్పష్టం చేశారు. తమను మోసం చేసేందుకే నిరుపయోగ, వివాదాస్పద స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఎన్నికల డ్రామా అని విమర్శించారు. ఓట్ల కోసం జూబ్లీహిల్స్ ముస్లింల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.