Real Estate | సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ ధరకు ప్లాట్ వస్తుందనే ఆశతో సామాన్య ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి నిండా మునుగుతున్నారు. ఇల్లు, ఓపెన్ ప్లాట్, ఫ్లాట్ అనేది హైదరాబాద్‌లో ఎక్కడో ఓ దగ్గర ఉండాల్సిందే.. ఇప్పుడు ఆలస్యం చేస్తే మున్ముందు కొనే పరిస్థితి ఉంటుందో ఉండదోననే ఆందోళనతో చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్‌కు ఆకర్షితులవుతున్నారు. మూడు, నాలుగేండ్ల క్రితం ప్రీ లాంచ్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పది నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ప్రధానంగా వందల కోట్ల మోసం జరిగిన కేసులు పది వరకు ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రా, సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి, ఆర్-హోమ్స్(ఆర్జే హోమ్స్), సాయి సూర్య డెవలపర్స్, అర్బన్వుడ్ రియాల్టీ ఎల్ఎల్పీ, జీఎస్ఆర్ ఇన్ఫ్రా తదితర సంస్థలు మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల దర్యాప్తునకు పోలీసులు నెలల సమయం తీసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తు విషయం చూద్దాం లే అన్నట్లుగా నిదానంగా చేస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్ని కేసుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీతో పాటు మరికొందరు అధికారులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా నిందితులతో కొందరు పోలీసులు మిలాఖత్ అవుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
ఆయా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…