సిటీ బ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): దోమలగూడ గగన్ మహల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. లేబరేటరీని సందర్శించి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారా? అని ఆరా తీశారు. ప్రసవగది, ఐపీ వార్డు, స్కానింగ్ రూమ్‌ను పరిశీలించి అనవసర వస్తువులను తొలగించి గదులు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయమాలిని, డాక్టర్ రాజ్య లక్ష్మి, తహసీల్దార్ సంధ్యారాణి, వైద్యులు పాల్గొన్నారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
సీఎం ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 99 దరఖాస్తులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ముకుంద రెడ్డి, డీఆర్ఓ వెంకటాచారి, ఆర్డీఓ సాయిరాం, అధికారులు పవన్ కుమార్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.