సిటీ బ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): నిమ్స్ విస్తరణ పనుల్లో పెంచి నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పంజాగుట్ట లోని నిమ్స్ దవాఖానలో విస్తరణ ప్రాజెక్టులో చేపట్టిన పనుల వివరాలు, పురోగతి, బ్లాక్ ల వారీగా జరుగుతున్న పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్ అండ్ బీ అధికారులు కలెక్టర్ కు వివరించారు. 19.54 ఎకరాలలో 26 ,19, 209 చదరపు అడుగుల విస్తీర్ణం లో రూ. 1698 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఇంతవరకు 35 శాతం పురోగతి సాధించగా 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిపై సీఎం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో కలసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి , సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, ఆర్ అండ్ బీ ఎస్సీ నర్సింగరావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెగా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ విశ్వకుమార్ , డీఈ లు, ఖైరాతాబాద్ తహసీల్దార్ నాయిమొద్దీన్, డాక్టర్లు , ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.