అమీర్పేట్, జూలై 12 : భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్వహణ ఇ ప్పుడు గాలిలో దీపంలా మారింది. రెండేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతుండడం గమనార్హం. ఆలయ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై స్థానికుల నుంచి ఒత్తిడి మొదలు, అటెండర్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు ఎవరికి వారే గ్రూపులు కడుతున్నారు. ఆలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను స్థానికులు కొందరు నేరుగా దేవాదాయ శాఖ మంత్రికి రిజిస్టర్ పోస్టులు పంపే వరకు పరిస్థితులు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో ఆలయ ఇన్చార్జి ఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మహేందర్ గౌడ్ సీనియర్ అధికారిగా అందరి సహకారంతో ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విజయం సాధించారు. అయినప్పటికీ ఈవోకు ఒకరిద్దరు ఉద్యోగులు మినహా సూపరింటెండెంట్ నుంచి అర్చకుల వరకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు, ఒక రకంగా ఇక్కడ ఈవోకు ఉద్యోగులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు పరిస్థితులు చెబుతున్నాయి.
అసంపూర్తిగా పార్కింగ్ కాంప్లెక్స్..
పరిపాలన వ్యవహారాల్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం రెండేళ్లుగా తిరోగమన దిశకు మళ్లిందనే చెప్పాలి. ఆలయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆలయ ఆవరణలోని సంపులో పడిన ఓ వ్యక్తి దుర్మరణం చెందడం, వెలుగు చూసిన నకిలీ టిక్కెట్ల వ్యవహారం, భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన వాహనాల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ముందుకు కదలక పోవడం వంటి అంశాలు, దేవాలయ పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. గతంలో వెలుగు చూసిన నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో దేవాలయంలో కీలక విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నా, ఓ చిరుద్యోగినిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. గత మంత్రి తలసాని చొరవతో ప్రారంభమైన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఊహించని విధంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు నిలిచిపోవడానికి ఆలయ, దేవాదాయ (ఇంజినీరింగ్ అధికారులు మధ్య లోపించిన సమన్వయమేనని దాతలు సైతం విమర్శిస్తున్నారు.
ఉన్నతాధికారుల అండదండలు ..
పూర్తి స్థాయి ఈవో నియామకం జరగకుండా దేవాలయానికే చెందిన కొన్ని శక్తులు పని చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు దేవాదాయ శాఖ చెందిన ఉన్నతాధికారుల సంపూర్ణ సహాయసహకారాలు పుష్కలంగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా తలసాని కొనసాగిన సమయంలో దేవాలయానికి సమర్థులైన అధికారుల నియామకం జరిగింది. మారిన పరిస్థితుల్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి పూర్తి స్థాయి ఈవోను నియమించాలనే ఆలోచన అటు ప్రభుత్వానికి గానీ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలిసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు గానీ కలగకపోతుండడం ఎల్లమ్మ దేవాలయంలో కచ్చితంగా గందరగోళాన్ని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.