వీడని 22ఏ చిక్కుముడి.. చేతల్లో కానరాని పరిష్కారం
యాజమాన్య హక్కులపై సర్కార్ రాజేసిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది. పొంగు మీద నీళ్లు చల్లుతున్నట్లుగా ప్రభుత్వం ఇస్తున్న మెమోలు మారిపోతున్నాయి.
- మెమోలిచ్చి జారుకుంటున్న సర్కార్.. ఆందోళనలో భూ యజమానులు
మూడు కమిషనరేట్ల పరిధిలో లక్షలాది ఆస్తులపై భూ యాజమాన్య హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఊకదంపుడు ఊరడింపులు, అక్కరకు రాని ఆదేశాలతో పూట గడుపుతూ లక్షలాది మంది భూ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 22ఏ భూములపై వచ్చిన సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 12 అంశాలను గుర్తించామని, అందులో దశల వారీగా వాటికి పరిష్కారం చూపుతామన్నారు. కానీ నెల రోజుల వ్యవధిలో సర్కార్ వరుసగా మెమోలను జారీ చేస్తూ… సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఇప్పటివరకు జీవో 118, యుఎల్‌సీ దరఖాస్తులపై ప్రభుత్వ వైఖరితో జనాలు నిండా మునిగేలా ఉన్నారు.
-సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) : మాటల్లో చెప్పి, చేతులు దులుపుకొంటున్న ప్రభుత్వం… చేతల్లో చూప డం లేదు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో తీవ్రరూపం దాల్చిన 22ఏ సమస్యకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో మధ్యతరగతి ప్రజలు, పేదలు బలిపశువులు అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వానికి మాటలలో తప్ప చేతలలో ఎలాంటి పనితనం కనబడటం లేదని, ఆరంభ సూరత్వంతో ఆదేశాలు ఇవ్వడం మినహా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. ఇప్పటివరకు గుర్తించిన సమస్యలపై విడుదల చేసిన మెమోలతో సామాన్యుడి ఆస్తి ఇరుక్కుపోయింది.
అమలు కానీ క్రమబద్ధీకరణ
జీవో నెం. 118 కింద రెగ్యులరైజేషన్ ప్రక్రియ అత్యంత మందకొడిగా, నత్తనడకన సాగుతోంది. యూఎల్సీ దరఖాస్తులకు ఇప్పటివరకు ఎలాంటి మోక్షం లభించలేదు. సర్కారు ఇచ్చిన మెమోలతో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు, మెమోల సంగతి పక్కనపెట్టండి… ఆదేశాలు, విధివిధానాలు వచ్చేంత వరకు దరఖాస్తుదారుల సమస్యలకు పరిష్కారం చూపలేమని, ఏ ఒక్క ప్లాటును కూడా క్రమబద్ధీకరించలేమని తేల్చి చెబుతున్నారు.
మార్గదర్శకాలు (గైడ్ లైన్స్) రాలేదన్న సమాధానాలను విని జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెవెన్యూ మంత్రివర్యులు జీవో 59 లోని పాత దరఖాస్తులను పరిశీలిస్తామని ప్రకటనలు ఇస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో స్పష్టత లేదని పేరొంది.
తీవ్ర సమస్యగా యూఎల్సీ…
తీవ్రమైన యుఎల్‌సీ సమస్య ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోనే ఎక్కువగా ఉంది. ఏ జిల్లాలో, ఏ మండలంలో జీవో 118 కింద ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఇప్పటివరకు ఎంతమందికి రెగ్యులరైజ్ చేశారు? ఎంతమంది దరఖాస్తులు తిరసరణకు గురయ్యాయి? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ముఖ్యంగా మేడ్చల్-మలాజిగిరి జిల్లాలో యూఎల్సీ సమస్య అత్యంత తీవ్రంగా ఉందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అస్పష్టమైన విధానాలతో జనాలకు ఇబ్బందులు
అయితే సర్కారు పరిష్కారం పేరిట చెబుతున్న మాటలు, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు భారీ వ్యత్యాసం ఉంది. దశాబ్ధాల కాలంగా తమకు చెందిన ఆస్తులను వివాదస్పదం చేసిన ప్రభుత్వం… వాటిని పరిష్కరించడానికి ఎందుకు జాప్యం చేస్తుందనేది భూయజమానులకు కలవరపెడుతోంది. ఇప్పటివరకు మెమోలు జారీ చేసిన జీవో నెం. 118, జీవో నెం. 59, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై స్పష్టమైన విధివిధానాలు లేక అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జీవో 59 విషయంలోనూ పారదర్శక విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
జీవో 118, యూఎల్సీ, జీవో 59, జీవో 58 కింద వెంటనే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం లేదు. యుఎల్‌సీ దరఖాస్తులను ఏ రోజు నుండి పరిశీలిస్తారనే సమాచారం దరఖాస్తుదారులకు కరువైంది. దరఖాస్తుదారులకు నగదు చెల్లించే నోటీసులు కూడా ఇప్పటివరకు జారీ చేయలేదు. రిజిస్ట్రేషన్లు చేసి, అనుమతులు ఇచ్చి, ఏళ్లుగా ఇంటి పన్నులు వసూలు చేసిన ప్రభుత్వమే… ఇప్పుడు మీ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్లు కాకుండా వేధిస్తున్న సర్కార్.. డబ్బులు లేని పేదలు, మధ్యతరగతి జనాలు కాంగ్రెస్ బాధితులకుగా మారి ఉన్న ఆస్తులను అమ్ముకునే వీల్లేకుండా పోయింది. ఈ విషయంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి..ప్రతి బాధితుడి సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

