సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 23: వైద్య ఆరోగ్య శాఖలో ధీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులకు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరు పతిరావు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలు, ప్రొఫెసర్ల బదిలీలపై ఉత్తర్వులను విడుదల చేసినందుకు గాను టీటీజీడీఏ ప్రతినిధులు శనివారం మంత్రి హరీశ్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పూల బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు టీటీజీడీఏ ప్రతినిధులకు జీవో కాపీలను అందజేశారు. అనంతరం వారు కోఠిలోని డీఎంఈ ఆవరణలో సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 26 వైద్య కళాశాలల డీఎంఈ డాక్టర్ల అందరి కోరిక మేరకు పీఆర్సీ బకాయిలపై స్పందించి రాష్ట్ర నాయకులతో చర్చించి పీఆర్సీ, ప్రొఫెసర్ల బదిలీలు రెండు ఉత్తర్వులను విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావుతో టీటీజీడీఏ రాష్ట్ర నాయకుల చర్చలకు సహకరించిన టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ధీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు తామంతా రుణపడి ఉంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు. యూజీసీ ఏరియర్స్, ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్లకు చెందిన జీవోలను విడుదల చేయడం పట్ల వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీజీడీఏ కోశాధికారి డాక్టర్ కిరణ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదాల, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.