హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్బావానికి ముందు తెలంగాణ ప్రాంతంలో మత్స్య రంగం పూర్తి నిరాదరణ కు గురైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్‌గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని చెప్పారు.మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరుగా మారాలనే ఆలోచనతోనే ఉచితంగా రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. చెరువులపై మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
కాగా, మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా పిట్టల రవిందర్ ముదిరాజ్ ను, వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య గంగ పుత్రలను సీఎం కేసీఆర్ నియమించారు. వీరిలో చైర్మన్ గా పిట్టల రవిందర్ ముదిరాజ్ బాధ్యతలను చేపట్టగా, వైస్ చైర్మన్ గా మల్లయ్య గంగపుత్ర ఆగస్టు 25 వ తేదీన బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అక్కడే ఉన్న మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా లను మంత్రి ఆదేశించారు.