
సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ) : ఆరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరగనంతగా హైదరాబాద్ అభివృద్ధి ఈ ఏడేండ్లలో జరిగిందనేది అక్షరసత్యం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఓ సవాల్ లాంటిది. ఈ సవాల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏడేండ్ల కిందటే స్వీకరించి నగరాభివృద్ధికి విశేష కృషి చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గ్రేటర్లో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా.. ముందుకుసాగుతున్నది.
రూపాయికే కిలోబియ్యం, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బస్తీ దవాఖానలతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం, ఉచిత నీటి సరఫరా, ఆత్మగౌరవ సౌదాలు ఇలా సంక్షేమ రంగంలో స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పేదలు, సబ్బండవర్ణాల ప్రజలు ప్రస్తుతం స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలను పొందుతూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఐదేండ్ల వ్యవధిలో రూ.50వేల కోట్ల అభివృద్ధే లక్ష్యంగా.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నది.
ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న సదుద్దేశంతో శ్రీకారం చుట్టిన ‘అన్నపూర్ణ’ కేంద్రాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని నిరాశ్రయులు, చిరు వ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ఐదు రూపాయల భోజనం అందిస్తున్నారు. శుచి, శుభ్రతలకు, రుచికరమైన భోజనానికి పెట్టింది పేరుగా అన్నపూర్ణ కేంద్రాలు మారాయి. నార్సింగిలో భోజనాలను తయారీ చేస్తూ దాదాపు 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నిత్యం 80వేల మందికి భోజనాలను అందిస్తున్నారు. ఒక్కో భోజనం ఖర్చుకు రూ.27.50 అవుతుండగా, జీహెచ్ఎంసీ రూ.22.50 భరిస్తున్నది. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాదాపు రోజుకు రూ.16 లక్షలకు పైగా జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నది.
నిరుపేదల కోసం జలమండలి రూపాయికే నల్లా కనెక్షన్ అందిస్తున్నది. దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా అర్బన్ మిషన్ భగీరథ పథకంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు లక్షకు పైగా నల్లా కనెక్షన్లకు అనుమతులు ఇచ్చారు. పేదల నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేసింది.
నాడు వైద్యం కోసం ఉస్మానియా, గాంధీ దవాఖానకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ కట్టినా.. సరైన వైద్యం అందేదికాదు. ప్రైవేటుకు వెళ్తే ముక్కుపిండి.. జేబులకు చిల్లు పెట్టేవారు. దీని వల్ల కొంత మంది రోగులు చిన్న చిన్న సమస్యలను తేలికగా తీసుకుంటూ ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర పరిణామాలకు దారితీసేది. వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ పేదల ముంగిటకే వైద్యం తీసుకువెళ్లాలని సంకల్పించారు. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 220 బస్తీ దవాఖానలు (హైదరాబాద్ – 133, రంగారెడ్డి – 35, మేడ్చల్-మల్కాజిగిరి – 52) స్థానిక ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో బస్తీ దవాఖానలు కీలక పాత్ర పోషించాయి. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 2వేల నుంచి 2500మంది వరకు ఈ బస్తీ దవాఖానల ద్వారా చికిత్స పొందుతున్నారు.
నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. హెయిర్ సెలూన్లు, దోబీఘాట్లకు అయ్యే విద్యుత్‌ను పూర్తి రాయితీతో ఉచితంగా ఇస్తుంది. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 13,800 సెలూన్లు, 15,700 దోభీ ఘాట్లు, లాండ్రీ షాపులు, 25,100 ఫౌల్ట్రీ ఫామ్‌లు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి పథకం నిరుపేదలకు వరప్రదాయినిగా మారింది. 2017 జూన్ 3న సీఎం కేసీఆర్ నగరంలోని పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా తీసుకురావడం, ప్రసవం తరువాత తల్లీబిడ్డను దవాఖాన నుంచి ఇంటికి సురక్షితంగా చేర్చడం జరుగుతుంది.
కేసీఆర్ కిట్ ద్వారా మగ బిడ్డ జన్మించిన వారికి రూ.12వేలు, ఆడబిడ్డ జన్మించిన వారికి రూ.13వేల నగదుతో పాటు 15 రకాల వస్తువులను కిట్ద్వారా అందిస్తున్నారు. దీంతో ముఖ్యంగా సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 90శాతం సహజ ప్రసవాలే జరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ వ్యాప్తంగా 2017జూన్ నుంచి ఇప్పటి వరకు 2,92,620మంది లబ్ధిదారులు కేసీఆర్ కిట్స్‌ను పొందినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో అనేక మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది
రాష్ట్రంలో కమర్షియల్ వాహనదారులకు ప్రభుత్వం 6 నెలల పన్ను రాయితీని ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.267కోట్లు ఉండగా, గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 1.35 లక్షల కమర్షియల్ వాహనాలకు రూ.135 కోట్ల ( హైదరాబాద్‌లో రూ.40 కోట్లు, రంగారెడ్డిలో రూ.50 కోట్లు, మేడ్చల్‌లో రూ.45 కోట్లు) పన్ను మాఫీ అయ్యింది. ప్రభుత్వం నిర్ణయంతో లారీ యజమానులు, క్యాబ్స్ డ్రైవర్లు, యజమానులు, ఆటో ట్రాలీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ వాహనాల నిర్వాహకులు లబ్ధి పొందారు.
చిన్న, సన్నకారు రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, నిరంతర విద్యుత్ వంటి పథకాలు తెచ్చి రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అలియాబాద్ గ్రామంలో నాకున్న 30 గుంటల పొలానికి తీసుకున్న రూ.30వేల రుణం నెల రోజుల కింద మాఫీ అయ్యింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. – కుంట మల్లేశ్, అలియాబాద్, శామీర్‌పేట
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలన్న కలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసి ‘వివేకానంద విద్యా పథకం’ ద్వారా రూ.13 లక్షల సహాయాన్ని అందించి అండగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటును జీవితకాలం మరిచిపోలేను. – దేవులపల్లి వెంకట భరత్ కశ్యప్, మియాపూర్
నాకు కొడుకులు లేరు. బిడ్డలకు పెండ్లీలు చేసి అత్తగారింటికి పంపించాం. మాకు వయస్సు మీద పడింది. పూట గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ అందజేస్తున్న వృద్ధాప్య పింఛన్‌తో బతుకునీడుస్తున్నాం. మాలాంటి వారిని ఎందరినో కన్న కొడుకులా ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలి. – పోచమ్మ, కొత్తగూడ, కందుకూరు
నా కుమార్తె పెండ్లికి అప్పుకోసం తొక్కని గడప లేదు. అయినా అప్పు పుట్టలేదు. పెండ్లి ఎట్ల గడుస్తదో తెల్వక ఆందోళన చెందుతున్న సమయంలోనే షాదీముబారక్ పైసలు అందినయి. నిమ్మలంగా పెండ్లి జరిగింది. కొడుకులు సూడని ఈ దినంల మా ఇంటికి పెద్దకొడుకై సీఎం కేసీఆర్ తోడుగా వచ్చి ఆదుకుండు. సీఎం సార్ చేసిన సాయంతోనే సమాజంలో తలెత్తుకుని ఉన్నాం.- మహ్మమద్ ఫారూఖ్, చార్మినార్
ఒకప్పుడు వైద్యం కోసం ప్రైవేటుకు పోవాల్సి వచ్చేది. డబ్బులు లేక ఇబ్బందులు పడేది. కార్మికనగర్‌లో ప్రభుత్వం బస్తీ దవాఖాన ఏర్పాటు చేసింది. పైసా ఖర్చులేకుండా మెరుగైన వైద్యం పొందుతున్నాం. రోగం పెద్దదైతే డాక్టర్లు పీహెచ్‌సీలకు, పెద్ద దవాఖానలకు పంపుతున్నారు. మా బాగుకోరి బస్తీలోనే దవాఖాన ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.- డి.సోని, గృహిణి, కార్మికనగర్, జూబ్లీహిల్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో గొల్ల కురుమలకు ఎంతో మేలు జరుగుతున్నది. మాకు 30 గొర్రెలు ఇచ్చారు. అవి ప్రస్తుతం పెరిగి రెండింతలయ్యాయి. మా కులవృత్తిని గుర్తించి గొర్రెలు అందజేసి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసినా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – యాదయ్య, గొర్రెల లబ్ధిదారుడు, సుల్తాన్‌పల్లి, శంషాబాద్ రూరల్
షెడ్యూల్ కులాలకు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. తెలంగాణలో బాల, బాలికలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వసతి గృహలను నెలకొల్పి సన్నబియ్యం, నాణ్యతమైన పోషకాహారం అందజేస్తున్నారు. ఉత్తమ బోధనతో పేదవిద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారు. – జే.కే. శైలజ, మాజీ జడ్పీటీసీ. మేడ్చల్
గుడుంబా వృత్తి మానేసినందుకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందింది. కిరాణ షాపు పెట్టుకున్నా. ప్రస్తుతం గర్వంగా తమ పని తాము చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు.- సంగీత బాయి, ధూల్‌పేట్ నివాసి, అబిడ్స్.
ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందిని సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మితో తీర్చుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి పథకం ఇవ్వలేదు. ఆడపిల్లల పెండ్లి చేసే బాధ్యతను పెద్దన్నలా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరు నెలల కిందట కల్యాణ లక్ష్మి పథకం అందుకున్నాం. -అల్గం నర్సింగ్‌రావు, టైలర్, ముషీరాబాద్.
మాది వ్యవసాయ కుటుంబం. మాకు ఉన్న రెండెకరాల భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా నా భర్త గుండెపోటుతో మరణించాడు. వ్యవసాయశాఖ అధికారులు ఇంటికి వచ్చి బుచ్చయ్య మరణించినట్లు ధ్రువీకరించిన సర్టిఫికెట్ తీసుకున్నారు. వారం రోజుల్లో రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. ఎదిగిన పిల్లలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ధీమా కల్పించిన సీఎం కేసీఆర్‌ను జీవితాంతం మరచిపోలేను. -ఎరువ ఇందిర,గృహిణి, చౌదరిగూడెం
నిరుపేద కుటుంబానికి చెందిన నేను సీఎం కేసీఆర్ దయతో ఈ రోజు ఓ కారుకు ఓనర్‌గా మారాను. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కింద రుణాలిచ్చి కారును కొనుగోలు చేసేలా చేయూతనిచ్చింది. నా కారును జీహెచ్ఎంసీ అధికారులకు కేటాయించాను. ప్రతి నెలా అందుతున్న వేతనంలో నుంచి నెలసరి వాయిదాలు చెల్లించాను. నాలుగు నెలల కిందట వాయిదాలు పూర్తి కావడంతో ఇప్పుడు నేను కారుకు ఓనరునయ్యాను. -ఎన్.సందీప్, యూసుఫ్‌గూడ.
రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. ఒకప్పుడు పెట్టుబడి కోసం నగలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు తెచ్చుకుని పంట వేసేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్య తీరింది. ఎకరానికి ఏటా రూ.10వేలు రైతుబంధు ఇస్తుండటంతో రైతుల బాధలు తీరాయి. వ్యవసాయం పండుగ అనేలా చేసినా సీఎం కేసీఆర్ వెంటే రైతులమంతా ఉంటాం. – కృష్ణయాదవ్, అంబేద్కర్‌నగర్, జవహర్‌నగర్