మేడ్చల్ / శామీర్ / కీసర / ఘట్కేసర్ రూరల్ : మే 15 : గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నట్టు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్, తూంకుంట, మూడుచింతపల్లి, కీసర, ఎదులాబాద్లలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తగిన ప్రోత్సాహం కల్పించకపోవడంతో నైపుణ్యం వెలుగులోకి రాలేదన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులను వెచ్చిస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడలను తమ నైపుణ్య ప్రదర్శనకు వినియోగించుకోవాలని సూచించారు. నైపుణ్యమున్న గ్రామీణ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.