ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు ముగిశాయి. పోటీల్లో రెండో రోజైన ఆదివారం స్కిట్, మిమిక్రీ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్నాయక్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సవిన్ సౌడ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇతర సాంస్కృతిక అంశాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తామని తెలిపారు.
ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వచ్చే నెల 26న ఓయూలోని ‘హెచ్ గ్రౌండ్’లో జరిగే కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని వివరించారు. విద్యార్థులు పోటీలకు ఉత్సాహంగా హాజరయ్యారు.