CV Anand | సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): పోలీసు ఉద్యోగం అనేది ఒక పవిత్రమైన ఉద్యోగమని, రాజ్యాంగానికి విధేయత చూపుతూ నిజాయితీగా ప్రజల మాన ప్రాణాలను కాపాడటంలో కర్తవ్యం నిరవర్తించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఏఆర్, ఐటీ అండ్ సీ, పీటీఓ, మెకానిక్ విభాగాలలో ైస్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా నియామకమైన వివిధ జిల్లాలకు చెందిన 747 మంది తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి గురువారం పేట్ల బురుజులోని కార్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ‘దీక్షాంత్ పరేడ్’ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, పేట్ల బుర్జులో 212, బేగంపేట్ సెంటర్లో 313, గోషామహల్లో 313 శిక్షణ తీసుకున్నారు. బీఎన్ఎస్, బీఎస్ఏ, బీఎన్ఎస్, స్పెషల్ అండ్ లోకల్ లా, లా అండ్ అర్డర్, క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్, ఇంటలిజెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, పర్సనాలిటీ డెవెలప్మెంట్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్లపై ఇండోర్ తరగతులు, అవుట్ డోర్లో క్యాడెట్లకు యోగా, ధ్యానం, శారీరక శిక్షణ, స్కాడ్ డిల్, లాఠీ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, పరేడ్ డ్రిల్, ఆయుధ వ్యూహాలు అండ్ కాల్పులు, ట్రాఫిక్ డ్రిల్ క్యాంప్ అండ్ ఫీల్డ్ క్రాప్ట్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణ ప్రక్రయకు సంబంధించిన నివేదకను ప్రిన్సిపాల్ అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాసరావు సమర్పించారు. కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి శిక్షణ పొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, ముఖ్య అతిథిగా సీవీ ఆనంద్ పరేడ్‌ను పరిశీలించి, పరేడ్ నుంచి గౌరవ వందనం స్వీకరించి ఆయా పోటీలలో ప్రతిభ కనబర్చిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతం చేసిన వారికి శుభకాంక్షలు తెలిపారు.
పోలీసులు ఏ ఒక్క రోజు పనిచేయకున్నా సమాజం నడవదన్నారు. 1992లో తాను ఐపీఎస్ శిక్షణ పొందానని, 80 మందితో మా పాసింగ్ అవుట్ పరేడ్ వర్షంలో జరిగిందని, తాను పోలీస్ శాఖలో చేరి 33 ఏండ్లు అవుతుందని గుర్తు చేసుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఇప్పుడు వేసుకున్న యూనిఫారం 30 ఏండ్ల తరువాత కూడా వేసుకునేలా ఉండాలని సూచించారు. 33 ఏండ్ల సర్వీస్‌లో 75-76 కిలోల మధ్యలోనే ఉంటూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నాని, దానికి చాలా శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి పనిచేయాలని, మీ సేవల ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు.