శంషాబాద్ రూరల్, జూన్ 19 : వీధి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందిన ఘటన బుధవారం శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లోనిగూడ వైపు నుంచి పాలమాకుల గ్రామం వైపునకు వీధి కుక్కలు ఓ దుప్పిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం తరుముకుంటూ రావడంతో భయంతో దుప్పి మృతి చెందింది.
స్థానికులు గమనించి వీధి కుక్కలను తరిమివేశారు. వెంటనే దుప్పి మృతి చెందిన విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని దుప్పిని మండలంలోని మల్కారం ఫారెస్టులో ఖననం చేస్తామని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. వీధి కుక్కలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒకచోట ఇలాంటి దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అని కోరుతున్నారు.