సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం నేటితరం యువతకు ఆశాకిరణంగా మారుతుందని చిలుకూరి బాలాజి దేవాలయ అర్చకుడు డా.సి.ఎస్.రంగరాజన్ అన్నారు. ఆదివారం నగరంలో ప్రారంభమైన భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియాన్ని రంగరాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది భవిష్యత్తు చిప్ సాంకేతికతలకు అంకితమైన ప్రథమ ప్రజల అనుభవ కేంద్రంగా నిలుస్తోందన్నారు.
ఈ మ్యూజియాన్ని చూస్తుంటే తాను 1988లో బయోమెడికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన రోజులు గుర్తొస్తున్నాయని, ఆ సమయంలో దేశంలో ఆవిషర్తలకు ఎలాంటి మద్దతు లేక ఇన్నోవేషన్ ఎకోసిస్టం లేకపోవడం వల్ల ఎంతో మందికి అవకాశాలు దకలేదన్నారు. తమ కాలంలో ఆలోచనలు ఉండేవి, కానీ వాటిని పెంపొందించేందుకు అవసరమైన మద్దతు లేకపోయిందన్నారు. ఈ ప్రదర్శనాకేంద్రం దేశ భవిష్యత్తు టెక్ నాయకులను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. టీ-చిప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ ‘ఇది కేవలం మ్యూజియం కాదు, భారతదేశపు సెమీకండక్టర్ భవిష్యత్తును ఆకారమిస్తోన్న టెక్నాలజీలకు గేట్వే’ అన్ని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.