Chilkur Balaji Temple | మొయినాబాద్, మార్చి 30 : చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వితరణ చేసే గరుడ ప్రసాదాన్ని ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ గరుడ ప్రసాదానికి ప్రతి ఏడాది భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు ప్రసాదం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా సులభతరమైన పద్ధతిలో ప్రసాదాన్ని వితరణ చేయాలని వచ్చి అభిప్రాయాల మేరకు బ్రహ్మోత్సవాల్లో కాకుండ ఇతర రోజుల్లో ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి నెలలో వచ్చే శుక్రవారాల్లో అభిషేకం ప్రసాదాన్ని గరుడ ప్రసాదంగా గత ఏడాది నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది కూడ కొనసాగిస్తామని చెప్పారు. ఏప్రిల్ మాసంలో కాకుండా మే నెల నుంచి ప్రతి నెల శుక్రవారాల్లో గరుడ ప్రసాదాన్ని వితరణ చేస్తామని అన్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చామని భక్తులు అర్థం చేసుకోవాలని సూచించారు.
విశ్వావసు నామ సంవత్సరంలో వర్షాలు బాగానే కురుస్తాయని.. ఈ ఏడాది అంతా బాగుంటుందన్నారు. అనంతరం బహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్స్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్ముదిరాజ్, స్వామి భక్తుడు పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.