కాచిగూడ, ఆగస్టు 27: పాత కక్షలతో ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసింది. ఈ కేసును కాచిగూడ పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి, ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, కాచిగూడ డివిజన్ ఏసీపీ వి.రఘు వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి చెందిన తిరుపతి భార్య దాసరి మంజుల (29) భిక్షాటన చేస్తున్నది.
ఇదిలా ఉండగా.. లచ్చ, మమత దంపతుల ఏడాదిన్నర చిన్నారి శ్రీలక్ష్మి సోమవారం అర్ధరాత్రి అమ్మమ్మ పార్వతమ్మతో కలిసి కాచిగూడ రైల్వేస్టేషన్ బస్టాప్‌లో పడుకున్నారు. గతంలో జరిగిన పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని మంజుల, ఆమె మరిది మున్నా కలిసి సోమవారం అర్ధరాత్రి చిన్నారి శ్రీలక్ష్మిని కిడ్నాప్ చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో పార్వతమ్మ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నిందితులు డబీర్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు ఆచూకీ కనుగొన్నారు. మంగళవారం ఉదయం చాకచక్యంగా వారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాసరి మంజులను మంగళవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో నిందితుడు మున్నా పరారీలో ఉన్నాడు. సమావేశంలో కాచిగూడ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, అంబర్‌పేట డీఐ మల్లేశ్వరీ, ఎస్సై జి.సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.