ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లాభం పొందేందుకే కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ( Chidambaram) చిలుక పలుకులు పలుకుతున్నాడని ఓయూజేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్(Mandala Bhasker) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న తీరును చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తోందని దుయ్యబట్టారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విధానం వల్ల 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు బలయ్యారని, మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అంటూ చిదంబరం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
సీమాంధ్రుల ఉద్యమంతో ఇచ్చిన తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుని ఎంతో మందికి గుండెకోత మిగిల్చిన ఘనత కాంగ్రెస్‌దేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే అధికార దాహంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో విద్య, వైద్య రంగాలలో అనేక సదుపాయాలు కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు(Support) బీఆర్ఎస్కు ఉంటుందని వెల్లడించారు.