సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): డేటింగ్ యాప్‌లో పరిచయమై పెండ్లి పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్స్ ఏసీపీ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా సంజమాల మండలానికి చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి టిండర్, నీతూ డేటింగ్ యాప్‌లో సందీప్ సన్నీ పేరుతో నకిలీ యూజర్ ప్రొఫైల్‌తో ఖాతా తెరిచాడు. తన ఖాతా నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. తన ప్రొఫైల్‌లో గూగుల్ ఉద్యోగినని, యాప్ డెవెలపర్ అని చెప్పుకుంటాడు. అతడి ప్రొఫైల్ చూసి కొందరు ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. వాళ్లతో ముందుగా ఫ్రెండ్‌గా మాట్లాడి, తరువాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. తరువాత తన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్నారని, అర్జెంట్‌గా డబ్బు అవసరమని.. కొంత డబ్బు సర్దితే మళ్లీ పంపిస్తానంటూ డబ్బులు లాగేస్తాడు. ఇలా సేకరించిన డబ్బును బెట్టింగ్, గేమింగ్ యాప్‌లలో పెట్టి జల్సా చేస్తాడు. అనంతరం వారిని నెమ్మదిగా దూరం పెడతాడు. ఈ క్రమంలో ఓ బాధితురాలు తనను నమ్మించి రూ. 6,41,736 లు మోసం చేశాడని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసింది.