కాచిగూడ, ఏప్రిల్ 12: మీ కుటుంబానికి పట్టిన దోషం పోగొడుతానని ఓ మహిళను మోసం చేసిన దొంగ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం కాచిగూడ పీఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, కాచిగూడ సీఐ జ్యోత్స్న వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎల్ బీ నగర్ లోని రాక్ టౌన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు హరిగెల సాంబశివుడు(45). వృత్తిరీత్యా ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్.
ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్‌తో దొంగ బాబాగా అవతారమెత్తాడు. తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ కుమార్ భార్య గీత వైద్య (47)దిల్సూఖ్నగర్లోని వశిష్ట జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది.సంవత్సరం క్రితం గీతా వైద్య భర్త మృతి చెందాడు. అదే కళాశాల ప్రిన్సిపాల్ సాయంతో సాంబశివుడు గీత వైద్యను పరిచయం చేసుకున్నాడు.
ఆమెకు మీ ఇంటికి దోషం ఉందని మీ పేరు మీద బాగాలేదని మీరు చాలా ఇబ్బందులు పడతారని భర్త చనిపోయినట్లే మీ కుటుంబమంతా చనిపోతారని మాయమాటలు చెప్పి దోషం పోవాలంటే శ్రీకాళహస్తిలో పూజలు చేపిస్తామని దానికి రూ. లక్షా 70 వేలు ఖర్చు అవుతుందని ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. గత కొన్ని రోజుల తర్వాత మళ్లీ అమె దగ్గరకు వెళ్లి మీ కూతురుకు పెళ్లయితే విడాకులు అవుతాయని, అందుకు దోష నివారణకు పెద్ద పూజలు చేయాలని, దానికి లక్షలు ఖర్చు అవుతాయని మాయమాటలు చెప్పాడు.
దానికి ఆమె నమ్మి ఆమె దగ్గర ఉన్న 26 తులాల బంగారు నగలు ఇచ్చింది. అంతే కాకుండా ఆమె ఇంటి పత్రాలను సైతం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గీత వైద్య కూతురు ప్రతిఘటించి దొంగ బాబా దగ్గరున్న ఇంటి పత్రాలను తీసుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో దొంగ బాబా సాంబశివుడిపై గీత వైద్య ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు సాంబశివుని అదుపులో తీసుకొని అతని నుంచి 20 తులాల 54 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగ బాబా కేసును ఛేదించిన డీసీపీ, అడిషనల్ డీసీపీ కలిసి కాచిగూడ సీఐ జోత్స్నకు, ఎస్ఐలకు, క్రైమ్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు హెచ్.నరేష్, పి.రవికుమార్, డి.సుభాష్‌తోపాటు క్రైమ్ సిబ్బంది శివ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.