సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం తప్పింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం ఉదయం 8.45 గంటలకు తాంబరం- హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు (12759) నాంపల్లి స్టేషన్‌లోని 5వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు నెమ్మదిగా వస్తూ.. డెడ్ ఎండ్ ఉన్న గోడను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్2, ఎస్3, ఎస్6 బోగీలు అదుపుతప్పి పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించి, వారికి తగిన వైద్య సహాయం అందించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేసిన కొందరు ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగారు. మిగిలిన ప్రయాణికులతో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ప్లాట్‌ఫాం ఒకటి నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను ఇతర ప్లాట్‌ఫాంల మీదుగా మళ్లించారు. అలాగే, నాంపల్లి స్టేషన్ నుంచి మేడ్చల్‌కు రాకపోకలు సాగించాల్సిన ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లను మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేశారు. ఆ తర్వాత యథావిధిగా ఎంఎంటీఎస్‌ను నడిపించారు.
డ్రైవర్ల నిర్లక్ష్యం..
ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దీపక్‌రావు, వెంకటేశ్వర్లు డ్రైవర్లు విధుల నిర్వర్తిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం, ఆలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు రైల్వే భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్పీ షేక్ సలీమా, డీఎస్పీ నర్సయ్య, ఆర్పీఎఫ్ సీఐ ఏ. శ్రీనివాస్ తమ సిబ్బందితో స్టేషన్ ఆవరణలో భద్రతను పర్యవేక్షించారు. అయితే, రైలు అతి వేగంగా ప్రయాణించి ఉంటే.. బోగీలన్నీ పట్టాలు తప్పేవని, పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు ఆధ్వర్యంలో రైల్వే అధికారుల బృందం వెంటనే ప్రమాదానికి గురైన ట్రాకుల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గురైన బోగీలను రిరైలింగ్ చేశారు. ఆ వెంటనే బోగీలను క్లియర్ చేశారు. సాధారణ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు జరుగలేదని, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సమయం ప్రకారమే రైళ్ల రాకపోకలు కొనసాగాయని బుధవారం రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేస్తారని తెలిపారు.