కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 30 : కేపీహెబీ కాలనీలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని హౌసింగ్ బోర్లు ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఎల్ఏవో రవీందర్‌రెడ్డి, వెస్ట్రన్ డివిజన్ ఈఈ కిరణ్‌బాబు, ఏఈవో ఫయిమ్, కూకట్పల్లి తహసీల్దార్ ఆశోక్, కేపీహెచ్‌బీ కాలనీ ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్ పర్యవేక్షణలో లక్కీ డ్రాను చేపట్టి… ఇండ్ల కేటాయింపునకు లబ్ధిదారులను ఎంపిక చేశారు.
కేపీహెచ్‌బీ కాలనీలో నిర్మించనున్న టవర్స్‌లో 480 ప్లాట్స్ కోసం ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించగా, 9,326 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 5,976 మంది అర్హత కలిగిన వారిని గుర్తించారు. ఎస్సీ కేటగిరీలో 67 ప్లాంట్లకు గాను 696 దరఖాస్తులు, ఎస్టీ కేటగిరీలో 24 ప్లాంటకు గాను 135 దరఖాస్తులు, ఓబీసీ 77 ప్లాట్స్‌కు గాను.. 3,610 దరఖాస్తులు, దివ్వాంగులకు 24 ప్లాట్స్‌కు గాను 26 దరఖాస్తులు, ప్రభుత్వ సంస్థలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 48 ప్లాట్స్‌కు గాను… 15 దరఖాస్తులు, జనరల్‌లో 240 ప్లాట్స్‌కు గాను…1494 దరఖాస్తులు వచ్చాయి. పై కేటగిరీలకు కేటాయించిన ప్లాట్స్ కోసం లక్కీడ్రా ద్వారా 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే..వెయిటింగ్ లిస్ట్ కోసం 120 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎంపిక ప్రక్రియ గందరగోళంగా ఉండటం, బీసీ, మహిళా కోటలకు ప్రాధాన్యత లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.
డ్రాపై విమర్శల వెల్లువ
ఇందిరమ్మ టవర్స్ కోసం నిర్వహించిన లక్కీడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గతంలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన లబ్ధిదారుల ఎంపికకు దీనికి చాలా తేడాలున్నాయని, పారదర్శకత లోపించిందని ఆరోపణలు చేశారు.ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల జాబితాను ప్రదర్శించకుండానే లక్కీడ్రా నిర్వహించారు. నోటిఫికేషన్లో మహిళలకు 30 శాతం కేటాయించాలని ఉండగా… లక్కీడ్రాలో మాత్రం మహిళా కోటాకు మంగళం పాడారు. బీసీల కోసం వాటను కేటాయించాల్సి ఉండగా….ఓబీసీ కేటగిరీలో బీసీలను కలిపి లక్కీడ్రా తీశారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగింది.
ఎస్సీ కేటగిరీ కోసం లక్కీడ్రా నిర్వహిస్తుండగా… అందులో 33 ఓబీసీ వాళ్లు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు అందోళన చేయడంతో డ్రా ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కేటగిరీపై అవగాహన లేకపోవడం వల్ల… హౌసింగ్‌బోర్డు ఉద్యోగులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని, దీనివల్ల దరఖాస్తు చేసుకున్నవారందరికీ ప్లాట్స్ కేటాయింపు జరిగిందని, జీహెచ్ఎంసీ ఇతవ విభాగాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు.
అలాగే..ఈ కేటగిరీలో మిగిలిన ప్లాట్స్‌ను జనరల్ కేటగిరీలో కలుపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా కేటగిరీల వారీగా వెయిటింగ్ లిస్ట్‌ను ఎంపిక చేయకండా… జనరల్‌గా 120 మందిని వెయిటింగ్ లిస్ట్‌ను ఎంపిక చేయడంపై సరికాదని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్వాంగులందరకి ఆన్యాయం జరిగిందని ఆందోళన చేశారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం 570 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం కలిగిన 2బీహెచ్‌కే ప్లాట్స్‌ను ఉచితంగా కేటాయిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం 525 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం కలిగిన ప్లాట్స్ కోసం 6లక్షలు కట్టాల్సి వస్తుందని, గత ప్రభుత్వమే పేదలకు ఉచితంగా ఇండ్ల ఇచ్చిందని, ఈ ప్రభుత్వం డబ్బులు ఉన్నవాళ్లకు ఇండ్లను కేటాయిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
కేటాయింపులో పారదర్శకత లేదు
శివప్రసాద్, కోఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, కేపీహెచ్‌బీ కాలనీ కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్ ప్లాట్స్ కేటాయింపులో నిబంధనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. పారదర్శకత లేకుండా… నోటిఫికేషన్లో పేర్కోన్న…మహిళలకు 30 శాతం కేటాయించకపోవడం, బీసీలను ఓబీసీలో కలపడం అన్యాయం. రిజర్వేషన్ వారీగా కాకుండా జనరల్‌గా వెయిటింగ్ లిస్ట్ తీసుకోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆన్యాయం జరిగింది. హౌసింగ్ బోర్డు స్థలంలో, హౌసింగ్ బోర్డు నిర్మిస్తున్న ఇండ్లలో గతంలో పాటించిన నిబంధనలు పాటించుకుండా… చిత్రవిచిత్రమై నిబంధనలు తీసుకోచ్చి లబ్ధిదారులను ఎంపికచేశారు. దీనిపై ప్రజలు ఆందోళన చేసిన పట్టించుకోకపోవడం బాధాకరం.