Electricity | సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): విద్యుత్ నెట్వర్క్లో తరచుగా అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు, పవర్ కండక్టర్లు, హెచ్జీ ఫ్యూజ్ల వద్ద మూగ జీవాలైన బల్లి, పిల్లి, పావురాలు, ఉడత, ఉడుము వంటివి మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో దాని ప్రభావంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
ఏకంగా 11 కేవీ ఫీడర్లు పలు చోట్ల ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరాకు ఒక్కసారిగా అంతరాయం కలుగుతోంది. మూగ జీవాలు విద్యుత్ నెట్ వర్క్లలోకి రావడం వల్ల ఫీడర్ల ట్రిప్పింగ్లు 14 శాతం అవుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తరచుగా తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారానికి పలు మార్పులు సూచించారు.
విద్యుత్ నెట్వర్క్లో ఉపయోగించే పరికరాల్లో ప్రస్తుతం, హర్న్ గ్యాప్ ఫ్యూజ్ (హెచ్జీ ప్యూజ్) వద్ద మెటల్ క్లాంపులు వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్(ఎఫ్ఆర్బీ) సిలికాన్ క్లాంపులను ఏర్పాటు చేస్తున్నామని సీఎండీ ముషారఫ్ తెలిపారు. ఈ సిలికాన్ క్లాంపు విద్యుత్ వాహకంగా పనిచేయవు.
కాబట్టి మూగ జీవాలు వాటి మీదుగా పాకినా, నడిచినా ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. ముందుగా చెట్లు అధికంగా ఉండి, ఇలాంటి మూగ జీవులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో దాదాపు 3000 ఎఫ్ఆర్బీ సిలికాన్ క్లాంపులను ప్యూజ్, బ్రేకర్స్, లింబ్స్ వంటి చోట ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మార్పుతో మూగ జీవాలకు ప్రాణ హానీ లేకుండా ఉండటంతో పాటు విద్యుత్ అంతరాయాలను కట్టడి చేసే అవకాశం ఉందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.