మియాపూర్, ఫిబ్రవరి 25 : చందానగర్ సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారిపై పాదచారుల వంతెనకు సంబంధించి లిఫ్ట్, ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ఫలితంగా పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఎస్కలేటర్ పనిచేయకపోతున్న ప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పాదచారులు ప్రమాదకరంగా రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
చందానగర్ సర్కిల్ పరిధిలోని జీఎస్ఎం మాల్ సమీపంలో జాతీయ రహదారిపై పాదచారుల సౌకర్యం కోసం పైవంతనను ఏర్పాటు చేశారు. వీటికి ఎస్కలేటర్, లిఫ్టు బిగించారు. కొంతకాలం కిందట ఇవి పాడైపోయాయి. అయినప్పటికీ వీటి నిర్వహణను గుత్తేదారు పూర్తిగా వదిలేయడంతో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు మెట్లు ఎక్కేందుకు నానా యాతనలు పడుతున్నారు. ఇవి పని చేయకపోవడంతో కొందరు జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందలాదిమంది ఈ వంతెనను వినియోగించి జాతీయ రహదారిని దాటుతున్నారు. కొంతకాలంగా ఇవి పనిచేయకపోవడంతో పాదచారుల ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించి పాదచర్ల వంతెన లిఫ్ట్ , ఎస్క లేటర్లకు మరమ్మతులు చేయించాలని పాదచారులు కోరుకుంటున్నారు.