సిటీ బ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియా ప్రభావంతో ఏర్పడే ఇబ్బందులను నియంత్రించేందుకు కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా సైబర్ భద్రత, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావంతో కలిగే అనర్థాలను వివరించి అవగాహన కల్పించేందుకు ముందడుగు వేసింది. ఈమేరకు శనివారం సీడీఎస్డబ్ల్యూ చీఫ్ మిషన్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ రాచమల్ల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో స్పార్క్, హార్మొని యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వినియోగం నిత్యజీవితంలో భాగమైంది.
దీని వల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయన్నారు. నష్టాలను నివారించేందుకు సీడీఎస్డబ్ల్యూ కృషి చేస్తుందని వెల్లడించారు. సీడీఎస్డబ్ల్యూ ఛైర్మెన్, కోఫౌండర్ ఆదిత్య ఊచి మాట్లాడుతూ.. భారత్లో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని, సగటున రోజుకు 7 గంటలు ఆన్లైన్లోనే ఉంటున్నారని అన్నారు. టెక్నాలజీని వాడటంతో పాటు సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యమైనదని వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వీసీ కృష్ణదేవరావు, జస్టీస్ ఈశ్వరయ్య, మానసిక వైద్యులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.