చిక్కడపల్లి, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభాను తక్కువ చేయడం మూలంగా ఇట్టి సర్వే పూర్తిగా తప్పుడు గణాంకాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. సర్వే ఫలితాలు పున: సమీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో జరిగే ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి జల్లాలు నల్గొండ, వరంగల్, కమ్మం అభ్యర్థి ప్రొఫెసర్ టి.వెంకట రాజయ్యకు సమాజ్ వాది పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో రాములు, ఏ.బాబు గౌడ్, వెంకటేశ్వర్లు, టి.వెంకట రాజయ్య, రిజ్వాన్, శ్రీహరి ముదిరాజ్ పాల్గొన్నారు.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి గౌడ్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల గణన తప్పుల తడకగా ఉందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదికను ఆయన వ్యతిరేకించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. పదేళ్ల తర్వాత బీసీ జనాభాను 46 శాతంగా చూపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 7 శాతం ఉన్న అగ్రకుల జనాభాను మాత్రం 15 శాతంగా చూపించి, బీసీలపై కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో జరిగిన తప్పులను సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
బీసీలను అణగదొక్కే కుట్ర
ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెరిగి బీసీల జనాభా తగ్గడమేంటి ?
రవీంద్రభారతి, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక తప్పుల తడకగా తయారైందని, బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్రలో భాగమమని, ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు కాపాడుకునేందుకే అగ్రవర్ణాల జనాభాను పెంచి చూపారని ఆరోపిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర ప్రజారాజ్యం పార్టీ అధినేత జిలుకర రవి కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభా 3 కోట్ల 70 లక్షలు ఉండగా, దానిలో బీసీ జనాభా కోటి 84 లక్షలుగా చూపించారని, ప్రస్తుతం, ప్రభు త్వం విడుదల చేసిన కులగణన నివేదికలో బీసీ జనాభా కోటి 64 లక్షలుగా తగ్గించి చూపించారని ఆయన విమర్శించారు.
బీసీల జనాభా తగ్గించడం లో కాంగ్రెస్ పార్టీ కుట్రలో ఒక భాగమన్నారు. బీసీలను రాజకీయంగా అణగ దొక్కే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2011లో ఓసీల జనాభా 10 శాతంలోపే ఉండగా, ప్రస్తుతం 15.79 శాతం పెరిగినట్లు చూపించారని, ఓసీలు పెరిగితే బీసీలు తగ్గడమేమిటని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సర్వే ఫలితాలను పూర్తిగా సమీక్షించి నిజమైన గణాంకాలను వెల్లడించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేసన్లు పెంచాలని, విద్యా, ఉద్యోగ రంగాలలో 52% పెంచాలని ఆయన డిమాండ్ చే శారు. బీసీల జనాభా తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తం భింప చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. 2014 లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే నిజమైనదని ఆయన చెప్పారు.
సర్వే పూర్తిగా బూటకం
గౌడ కల్లు గీత వృత్తిదారుడుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు అయిల వెంకన్న గౌడ్
చిక్కడపల్లి, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్టంలో నిర్వహంచిన బీసీ కుల గణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వే అని తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుడులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిల వెంకన్న గౌడ్ అన్నారు. చిక్కడపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకన్న గౌడ్ మాట్లాడారు. ఈ సర్వేలో గత 2014 సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీల సంఖ్య, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలు 46 శాతానికి కుదించడం పట్ల దుర్మార్గం అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అగ్ర కులాల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
బీసీలతో అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేయాలి
కుల గణనపై వస్తున్న ఆరోపణపై డెడికేషన్ కమిటీ, బీసీ కుల సంఘాలతో అఖిల పక్ష కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లిలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సామాజికి వర్గం జనాభా ఎక్కువ చూపించారని, బీసీల జనాభా తక్కువ చూపించినట్లు నివేదికపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. దీనిపై గ్రామ స్థాయిలో బీసీ కులాలు ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు 46 శాతంగా చూపించిన కమిటీ నివేదిక ఏ కుల జనాభా ఎంత లెక్కలు చూపవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.