సిటీబ్యూరో: ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు పక్కదారి పడుతున్నాయి. లైసెన్స్‌ల ఫీజు, వసూళ్ల బాధ్యత, పర్యవేక్షణ , సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ (ఏఎంఓహెచ్)లకు అప్పగించగా..ఇందులో కొందరు ఎస్ఎఫ్ఏలు, ఏఎంఓహెచ్‌లు అక్రమాలకు తెరలేపారు. లైసెన్స్‌లు లేని వ్యాపారుల నుంచి అందినంత దండుకోవడం, ట్రేడ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని రూ.10వేలు అయ్యే చోట సదరు వ్యాపారస్తుడి నుంచి రూ. 60వేలు వసూలు చేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో ఎస్ఎఫ్ఏలు ఈ అంశాలపైనే ఏసీబీకి చిక్కడం గమనార్హం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఫీజు వసూళ్లలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.
జీహెచ్ఎంసీ వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించి ఖజానాకు గండి కొడుతున్నారు. వాస్తవంగా 20 ఫీట్ల మేర సింగిల్ లేన్ రోడ్డు ఉంటే చదరపు మీటర్‌కు రూ.3లు, డబుల్ లేన్ రోడ్డు ఉంటే 20 నుంచి 30 ఫీట్ల మేర ఉన్న రోడ్లపై చదరపు ఫీట్‌కు రూ.4, రెండు లేన్ల కంటే ఎక్కువగా ఉండి 30 ఫీట్లకు మంచిన రోడ్లపై చదరపు మీటర్‌కు రూ. 6ల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రీనరీ చార్జీలు కూడా చెల్లించాలి. సంబంధిత వ్యాపారి నేరుగా ఆన్లైన్లో ఈ ఫీజు చెల్లించే వీలు ఉంటుంది. కానీ సర్కిల్లోని ఎస్ఏఫ్ఏలు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి భేరసారాలు అడుగుతున్నట్లు అరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు రూ. లక్ష ఇచ్చే వారి దగ్గర రూ. 50వేల వరకు తీసుకుని వదిలేస్తున్నారు. సదరు వ్యాపారస్తుడి నుంచి వచ్చిన ఫీజు బల్దియా ఖజానాకు చేరడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
గ్రేటర్ పరిధిలో చిన్న, పెద్ద వ్యాపారాలు కలిపి దాదాపు 12 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో రూ. 2.5 లక్షలకు పైగా కమర్షియల్ భవనాలు ఉండగా.. ఈ వాణిజ్య భవనాలన్నింటికీ ట్రేడ్ లైసెన్స్‌లు కూడా జారీ చేయలేదు. ఏటా జీహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్స్‌ల వసూళ్లలో ఆదాయం గణనీయంగా తగ్గుతున్నది. ఇందుకు వ్యాపారాలకు, వస్తున్న ఫీజులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదని రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్లో ఏదైన వ్యాపారం నిర్వహించాలంటే ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. అధికారులతో సంబంధం లేకుండా పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్పటికప్పుడే లైసెన్స్‌లు పొందేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది.
దరఖాస్తుదారులకే తమకు కావాల్సిన లైసెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకునే అవకాశం కల్పించినట్లయింది. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ‘ఇన్స్టాంట్ అఫ్రూవల్ విధానాన్ని మెజార్టీ దరఖాస్తులు దుర్వినియోగం చేస్తున్నారు. మమూలుగా ట్రేడ్ లైసెన్స్ రుసం.. దుకాణం విస్తీర్ణాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడే దీని నుంచి తప్పించుకునేందుకు చాలా మంది దుకాణాదారులు విస్తీర్ణాన్ని నామమాత్రంగా పేర్కొని తక్కువ రుసుంతో లైసెన్స్‌ను పొందుతున్నారు.
ఈ రకంగా జీహెచ్ఎంసీ గడిచిన నాలుగేళ్లలో రూ.50కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రేడ్ లైసెన్స్‌ల జారీలోనే కాదు ప్రతి అంశంలోనూ కొందరు అధికారులు, సిబ్బంది ఆక్రమాలకు పాల్పడుతున్నారు. ట్రేడ్ లైసెన్స్‌లలో ట్రేడ్ ఇండెక్స్ నంబరు (టిన్) ఇవ్వకుండా ప్రొవిజన్ విధానంలో.. ప్రాపర్టీ ట్యాక్స్ రెసిడెన్షియల్.. రెండు మూడింతలు పెరుగుతది. ట్రేడ్ లైసెన్స్ పాత ట్రేడ్ ఇండెక్స్ నంబరు.. ఈజీగా ఇవ్వరు.. ప్రొవిజన్ విధానంలో కొనసాగిస్తూ వ్యాపారస్తులతో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు అందినంత దండుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు.
9