సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడి, అందులో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి ప్లాటు కబ్జాకు యత్నించడంతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 125లలోని ఎఫ్‌సీఐ కాలనీలోని ప్లాట్ నంబర్ 84లో 700 గజాల స్థలాన్ని గత కొన్నేండ్ల కిందట కొనుగోలు చేసిన ఉమాదేవరాజు అనే మహిళ, అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నది.
కాగా, ఈ స్థలం మీద కన్నేసిన సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు గతంలో పలుమార్లు కబ్జాకు యత్నించాడు. దీంతో ఉమాదేవరాజు తన ప్లాట్‌లో రేకుల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వాచ్‌మన్ గదిని నిర్మించడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాగా, ఈనెల 26న అక్రమంగా ప్లాట్‌లోకి ప్రవేశించిన శ్రీధర్‌రావు అనుచరులు వెంకటేశ్, సాయికుమార్రెడ్డిలు సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, వాచ్‌మన్‌ను బెదిరించి, వాచ్‌మన్ గదితోపాటు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఉమాదేవరాజు ఈనెల 27వ తేదీన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు శ్రీధర్‌రావు, అతడి అనుచరులు వెంకటేశ్, సాయికుమార్రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 329/3, 324/4, 351/2, రెడ్‌విత్ 3,5 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని నానక్‌రాంగూడ భగీరథ చెరువులో మట్టి డంపింగ్ చేసి చదును చేసి చెరువును పూడ్చిన సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. భగీరథ చెరువును ఆక్రమించేందుకు కొంతకాలంగా పలువురు ప్రయత్నిస్తుండటంతో హైడ్రా అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో భగీరథ చెరువులో మట్టి డంపింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీమ్, ఇరిగేషన్ అధికారులు మట్టిని చదును చేస్తున్న జేసీబీ యజమాని దున్నపోతుల సురేశ్‌ను పట్టుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. విచారణలో సంధ్య కన్స్ట్రక్షన్ సంస్థ మట్టిని డంపింగ్ చేయించి, చదును చేయిస్తుందని జేసీబీ యజమాని చెప్పడంతో సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్‌రావుతోపాటు వెంకటేశ్వరరావు, సుంకర వీర వెంకట సత్యనారాయణ మూర్తి మణికంఠల మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఓఆర్ఆర్ లోపల చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై తమ నిఘా ఉంటుందని చెప్పిన హైడ్రా ఇప్పుడు అదే దిశగా ముందుకు పోతున్నది. ఆక్రమణలు జరిగాయంటూ తమ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాటిపై క్షేత్రస్తాయిలో పర్యటించి విచారణ చేపడుతున్నారు. బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి ఏడు చెరువులను సందర్శించారు. చెరువుల వద్ద ఆక్రమణలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు అక్కడి పరిస్థితులను వివరంగా తెలుసుకున్న కమిషనర్ విచారణ చేపడుతామన్నారు. చెరువుల పరిరక్షణలో భాగంగా హైడ్రాకు మున్సిపల్ చట్టం ప్రకారం అన్ని అధికారాలు సంక్రమించాయి.
ఇందులో ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే ఆక్రమణలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవడం, ఆక్రమణలని తేలితే వాటిని తొలగించడం వంటివి ఉన్నాయి. భగీరథమ్మ చెరువులో మట్టి డంపింగ్ చేస్తూ చదును చేస్తున్న వ్యక్తిని గమనించిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందం ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు కూడా తెలిపారు. ఎక్కడైనా ఆక్రమణలు జరుగుతున్నాయని తేలితే హైడ్రా స్వయంగా ఫిర్యాదు చేయడానికి అధికారాలు ఉన్నప్పటికీ అలాకాకుండా సంబంధిత శాఖ అధికారులతో ఫిర్యాదులు చేయించడం ఏంటని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు.
చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై గతంలో హైడ్రా పోలీసులకు వాటి పరిషన్లు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వారిపై కేసులు పెట్టేలా చేసింది. ఆ సమయంలో హైడ్రాకు అన్ని అధికారాలు లేవు. ఇటీవల ఆర్డినెన్స్ వచ్చిన తరవాత హైడ్రా ఒక వ్యవస్థగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా నేరుగా ఫిర్యాదు చేయడానికి వస్తున్న ఇబ్బందులేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయంపై ఒక హైడ్రా అధికారిని సంప్రదిస్తే ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతాయో వాటిపై సంబంధిత స్థానిక అధికారులతో ఫిర్యాదు చేయించడం సాధారణమని, దీనిపై లోతుగా చూడాల్సిన పనిలేదంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మాత్రం తమను కోర్టుల చుట్టూ తిప్పడానికే ఇలా చేస్తున్నారంటున్నారు.