దుండిగల్, మే 15: రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో బోర్డు తిప్పేసిన ప్రగతినగర్‌లోని చేతన్ జ్యువెలర్స్ యజమాని నితీశ్జైన్పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేటకు చెందిన ఓ బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పరారీలో ఉన్న నితీష్ జైన్‌పై చీటింగ్ కేసు నమో దు అయింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం…నిజాంపేటలోని రవి సాత్విక అపార్ట్మెంట్లో నివాసముంటున్న రాధా రాణి ఫిబ్రవరిలో ప్రగతినగర్‌లోని పీకాక్ చౌరస్తా సమీపంలో ఉన్న చేతన్ జ్యువెలర్స్ షాప్‌లో 125 గ్రాముల బంగారు నగలను తయారు చేయించుకుంది.
అయి తే అవి బాగా లేకపోవడంతో తిరిగి వాపస్ ఇచ్చి మళ్లీ తనకు నచ్చినట్లు చేయాలని సూచించింది. మార్చిలో చంద్రహారం, 4 బంగారు గాజులు, 1 కాసుల హారం చేయమని ఆర్డర్ ఇచ్చింది. అదే సమయంలో 3.5 కిలోల వెండి వస్తువుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం ఫోన్ పే ద్వారా, నగదు రూపేనా జ్యువెలర్స్ షాపు యజమాని నితీష్ జైన్‌కు రూ.15.50 లక్షలు అడ్వాన్స్‌గా అందజేసింది. తర్వాత నగల కోసం అడుగగా రేపు మాపంటూ గత రెండు నెలలుగా దాటవేస్తూ వస్తున్నాడు.
నేపథ్యంలోనే మీడియాలో చేతన్ జ్యువెలర్స్ యజమాని రూ.10 కోట్ల నగలతో ఉడాయించినట్లు రావడాన్ని గుర్తించిన రాధా రాణి.. షాపు వద్దకు వెళ్లి చూడగా నగల దుకాణం మూసి ఉన్నది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రాజస్థాన్‌కు చెందిన నితీశ్ జైన్ గడిచిన 15 ఏళ్లుగా ఇక్కడ జ్యువెలర్స్ షాప్ నిర్వహిస్తూ నమ్మకంగా ఉండి మోసానికి పాల్పడి.. రాజస్థాన్ వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేసి తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. నితీష్ జైన్ మోసంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో గురువారం ‘రూ.10 కోట్ల విలువ గల నగలతో బంగారం షాపు యజమాని పరార్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే.