బంజారాహిల్స్ : రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేయడంతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వెంగళరావునగర్ జీటీఎస్ ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం సందర్బంగా ఆదివారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు రహ్మత్‌నగర్ నుంచి జీటీఎస్ వెళ్లేదారిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మట్టా రవి, ఫయీమ్, అనిల్ ముదిరాజ్ అనే ముగ్గురు వ్యక్తులు ప్లెక్సీలను చింపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
ఫ్లెక్సీలను ఎందుకు చింపావంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు రాకేష్ తదితరులు అనిల్ ముదిరాజ్‌ను ప్రశ్నించగా వారితో పాటు ఎమ్మెల్యే మాగంటిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దుర్బాషలాడడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకుడు రాకేష్ క్రిస్టఫర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 323,341,427, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అనిల్ ముదిరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.