సికింద్రాబాద్, జనవరి 8: ఇటీవల నిర్వహించిన ఈవెంట్స్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్వహించిన అర్హత పరీక్షకు భారీ స్పందన లభించింది. పరవస్తు ఫౌండేషన్ నేతృత్వంలో ఆదివారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ కళాశాలతో పాటు వరంగల్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన 7.0 అర్హత పరీక్షకు అభ్యర్థులు బారులు తీరారు. ఎస్వీఐటీ కళాశాలలో 1350, వరంగల్‌లో 400, సంగారెడ్డిలో 350 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరవస్తు ఫౌండేషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్వీఐటీ కళాశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని ఫౌండేషన్ సలహాదారులు, డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి పరిశీలించారు. ఈ నేపథ్యంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కార్యదర్శులు సందీప్ హరి, గద్దె భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్హత పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నామన్నారు. 12వ తేదీన సెలక్షన్ అయిన అభ్యర్థులు వనపర్తి, సంగారెడ్డితో పాటు నగరంలోని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలన్నారు. అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన 200 మంది అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం, డ్రస్, స్టడీ మెటీరియల్‌తో పాటు ప్రత్యక్ష బోధన ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో 300 మంది అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారికి సైతం స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్రీన్‌ల్యాండ్స్ అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, విద్యాభూషణ్, గురుసేవ, రఘునాథ్ రెడ్డి, రాజ్‌కుమార్, డాక్టర్ విజయ్ భాస్కర్, స్వరణ్ సింగ్‌తో పాటు షడ్రక్ తదితరులు పాల్గొన్నారు.