పీర్జాదిగూడ, జనవరి 4: ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో సంవత్సర కాలంగా పద్మ అనే మహిళ అనురాగ్‌రెడ్డి పేరుతో బాయ్స్ హాస్టల్ నడుపుతున్నది. జనగామ జిల్లా, లింగాల ఘనపూర్ మండలం, బండ్లగూడెం గ్రామానికి చెందిన అనిరెడ్డి మహేందర్‌రెడ్డి(36) క్యాబ్ నడుపుతూ ఈ హాస్టల్లో ఉండేవాడు. నిర్వాహకురాలితో మహేందర్‌రెడ్డికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి..
అనంతరం హాస్టల్‌కు అప్పుడప్పుడు వస్తూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో హాస్టల్‌కు రమ్మని పద్మ పిలువడంతో శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటలకు వెళ్లాడు. అప్పటికే రూంలో సూర్యాపేటకు చెందిన అతడి స్నేహితుడు కిరణ్‌రెడ్డితో కలిసి పద్మ ఉన్నది. ఇది గమనించిన మహేందర్‌రెడ్డి వారితో గొడవకు దిగాడు. దీంతో కిరణ్‌రెడ్డి, పద్మలు వంటకు ఉపయోగించే గంటె, కూరగాయలు కోసే చాకుతో మహేందర్‌రెడ్డిపై విచక్షణంగా దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలైన మహేందర్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తున్నది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని.. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీకి తరలించారు.