హైదరాబాద్ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సు ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నామని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం పదిగంటలకు సదస్సు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీష్ రావు ఉదయం సెషన్లో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మధ్యాహ్నం సెషన్లో పాల్గొంటారని అన్నారు.
సాయంత్రం సెషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొని ముగింపు ఉపన్యాసం ఇస్తారని గెల్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని మా విద్యార్థి నేతలు ప్రతి కాలేజీకి వెళ్లి వివరిస్తున్నారు. అందుకు సంబంధించి ఐదు లక్షల కరపత్రాలు ముద్రించాం. విద్యార్థులను కలిసి తెలంగాణకు బనకచర్లతో జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలతో వివరిస్తున్నాం. ఎల్లుండి జరిగే సదస్సులో బనకచర్లపైనే ప్రధానంగా చర్చిస్తాం. చంద్రబాబు, మోదీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తాం. బనకచర్లపై జంగ్ సైరన్ మోగించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ‘బనకచర్లపై విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాటం చేసేందుకు మా విద్యార్థి విభాగం సన్నద్ధం అవుతోంది. గోదావరి నదీ జలాలపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర సంస్థలు తిరస్కరించాయి. తన గురువుకు ధారాదత్తంచేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రికి చదువే రాదు, మంత్రులు అస్సలు మాట్లాడటం లేదు. ప్రశ్నిస్తే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంత అణిచివేసే ప్రయత్నం చేసినా మా అధినాయకత్వం భయపడదు. ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ నీరుగారిపోతున్నాయి. కొత్తగా మళ్ళీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడింది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ అనలేదు. ఢిల్లీకి ఊడిగం చేస్తూ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు. రోజుకో డైవర్షన్ స్కీమ్‌తో తన పబ్బం గడుపుకుంటున్నాడు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రచేసి బనకచర్ల ప్రాజెక్టుకు గోదావరి నదీ జలాలను తరలిస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు, మా విద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కేసీఆర్ పదేళ్ల పాలనలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు కుక్కిన పేనులా ఉన్నారు. కేసీఆర్ లాంటి పులిని పండబెట్టి పిల్లిని గెలిపించారు. కేసులు పెట్టి వేధించటం ఇందిరమ్మ పాలనా..? కేటీఆర్ బర్త్‌డే ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ వాళ్ళు చింపేయటం అరాచకం. కృష్ణా గోదావరి జలాల్లో నీటి వాటా వచ్చేవరకు పోరాటం చేస్తాం. మేం పోరాటం మొదలు పెడితే మీ జేజమ్మలు కూడా మమ్మల్ని ఆపలేరు’ అన్నారు.
ఈ ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, చిరుమళ్ల రాకేష్ కుమార్, ఆంజనేయ గౌడ్, ధర్మేందర్ రెడ్డి, తుంగబాలు, కడారి స్వామి యాదవ్, కృష్ణ పాల్గొన్నారు.