మేడ్చల్/దుండిగల్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం గండిమైసమ్మలో నిర్మించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. రుణ మాఫీ చేసినట్లు గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఒక్కరికీ రుణమాఫీ ఎందుకు కాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో రుణ మాఫీకి సంబంధించిన పలు పత్రాలను బాధిత రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ ఒక్క ఘట్కేసర్ మండలంలోనే రుణమాఫీ అయ్యే రైతులు 1189 మంది ఉంటే ఒక్కరికీ కూడా రుణమాఫీ కాలేదని రికార్డులు చూపిస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం రుణమాఫీ రైతులందరికీ చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ సన్నాసులకు ఇదొక్కటి సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అమలు జరిగేలా ప్రజలకు మద్దతుగా ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చరిత్రను తెలుసుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణను నిండా ముంచుతారన్నారు.
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా.. బీఆర్ఎస్దే గెలుపు ఉండేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏ ఒక్క పథకం అమలు చేయకుండానే ప్రజాపాలన పేరిట విజయోత్సవాలను నిర్వహిస్తూ ప్రజా సంపదను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే బూత్ స్థాయి నుంచి సభ్యత్వాలను చేస్తూ.. పూర్తిస్థాయిలో కమిటీలను వేసుకొని పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చేలా నూతన ఒరవడికి శ్రీకారం చుడుతామన్నారు.