నిషేధిత జాబితా భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. పటాన్చెరు కేంద్రంగా శనివారం నిర్వహించే 22ఏ భూ బాధితుల నిరసన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం పటాన్‌చెరులోని క్యాంపు కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో సభకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిమాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలో ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్, పట్టా భూములు, రిజిస్ట్రేషన్ ఇండ్లను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో 22ఏ భూ బాధితుల నిరసన సభ ఏర్పాటు చేశామని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. 22ఏ బాధితులు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. – పటాన్చెరు టౌన్