హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సృష్టి జూపుడి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. బ్రిక్స్ సీసీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకమైంది. వర్తక, వాణిజ్య అంశాలు, అభివృద్ధి సహాయ సహకారాలే ప్రధాన ఎజెండాగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమినే బ్రిక్స్‌గా పిలుస్తారు. బ్రిక్స్ మాతృసంస్థనే సీసీఐ (చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్). ఇది బ్రిక్స్ సభ్య దేశాల్లోని యువతను ప్రోత్సహిస్తూ వారిని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంటుంది.
ప్రస్తుతం సీసీఐ ప్రపంచ ప్రచారకర్తగా హైదరాబాద్ యువతి, ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సృష్టి జూపుడి ఎంపికకావడం తెలంగాణకు గర్వకారణం. ఏడాదిపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సృష్టి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపేందుకు, బ్రిక్స్ చేపడుతున్న కార్యక్రమాలను వారికి చేరవేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆనందం వ్యక్తం చేశారు. సృష్టి ఎంపికపై క్రీడాకారులు, నగరంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.