హైదరాబాద్ : నగరంలోని హిమాయత్‌నగర్ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ ఉత్సవాలకు జూన్ 5న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జూన్ 6న ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాకారంలో శేష వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తారు. ఉదయం 11.20 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు విహరిస్తారు. 7న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, ఉదయం 10.30 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభవ వాహనసేవ జరుగనుంది.
8న ఉదయం 9 గంటలకు గజవాహనం, ఉదయం 11 గంటలకు శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు గరుడసేవ జరుగనున్నది. 9న ఉదయం 8 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ జరుగనున్నాయి. 10న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.