అల్వాల్, జనవరి 4: అల్వాల్‌లోని లోతట్టు ప్రాంతాల్లో దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కా రం లభించింది. సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతున్న వర్షంనీటిని మళ్లించేందుకు చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఎగువ నుంచి ఓల్డ్ అల్వాల్, శ్రీనివాస్‌నగర్, చినరాయుని చెరువు వైపు వర్షంనీరు భారీగా ప్రవహించేది. దీంతో ఆయా ప్రాంతా ల్లోని ఇండ్లు నీట మునిగేవి. ఇలా కొన్నేళ్ల నుంచి స్థానికు లు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవించేవారు. దీంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి రూ.14 కోట్ల ఎస్ఎన్డీపీ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఫలితంగా గత రెండు నెలల క్రితం బాక్స్డ్రైన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు చివరిదశకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు పనులు పూర్తయిన స్థలంలో సీసీ రోడ్లు వేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తీరనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుచిత్ర-రాజీవ్ రహదారి మూసివేసి..
కొత్తరాయుని చెరువు నుంచి శ్రీబేకరి, రెడ్డి ఎన్క్లేవ్ మీదుగా సుచిత్ర, రాజీవ్ రహదారి ప్రధాన మార్గం వరకు బాక్స్డ్రైన్ పనులు పూర్తయ్యాయి. అయితే ప్రధాన రహదారి మీదుగా జ్యోతినగర్వైపు పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో సుచిత్ర, రాజీవ్ రహదారి ప్రధాన మార్గాన్ని వేశారు. అక్కడ రోడ్డు తవ్వి బాక్స్డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు నెలరోజుల సమయం పట్టనుంది. అందుకే ఈనెల 31వరకు ఆ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా రాజీవ్ రహదారి నుంచి అల్వాల్ తెలంగాణ తల్లి విగ్రహం, శ్రీబేకరి, ఐజీ స్టాచ్యూ, లయోలా అకాడమీ మీదుగా సుచిత్రకు వాహనాలను మళ్లిస్తున్నారు. సుచిత్ర నుంచి రాజీవ్ రహదారికి వెళ్లే వాహనాలు కూడా అదే మార్గంలో వెళ్తున్నాయి.