సిటీబ్యూరో, డిసెంబర్ 19 ( నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి : చరిత్ర చదివితే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ప్రారంభించారు. సుమారు 350 స్టాళ్లు కొలువుదీరాయి. ఈనెల 29 వరకు బుక్ ఫెయిర్ ఉండనుంది. ఇందులో 200 మందికిపైగా దేశ వ్యాప్తంగా ప్రచురణ కర్తలు, డిస్ట్రిబ్యూటర్లు, పుస్తకాలను ప్రదర్శించనున్నారని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. యాకుబ్ షేక్ తెలిపారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశామని చెప్పారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరామ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, ప్రొఫెసర్ రమామేలుకోటే, ప్రముఖ పాత్రకేయులు రాంచంద్రమూర్తి, నగర గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, సొసైటీ సభ్యులు బాల్‌రెడ్డి, బి.శోభన్‌బాబు, ఆర్.శ్రీకాంత్, యు.శ్రీనివాస్‌రావు, సాంబశివరావు, స్వరాజ్ కుమార్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.