Bonalu Festival | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బోనాల ఉత్సవాలకు గ్రేటర్ ముస్తాబవుతోంది. 26వ తేదీన గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 13న ఉజ్జయినీ మహంకాళి, 14న రంగం, 20న పాతబస్తీ అక్కన్న, మాదన్న బోనాల జాతర, 24న బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బందోబస్తు, తాగునీరు, పారిశుధ్యం, ఎలక్ట్రిసిటీ అన్ని విభాగాలతో సమీక్ష చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. 3,026 దేవాలయాలు బోనాల ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయని, నిధుల్లో 10 శాతం పెంచనున్నుట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేవాయాలయాలకు నిధులు రాకుంటే అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.