చాంద్రాయణగుట్ట/చార్మినార్, జూలై 21(నమస్తే తెలంగాణ) : పాతనగరంలో ఆషాడమాసం బోనాల జాతర సందర్భంగా సోమవారం నిర్వహించే శ్రీ మహంకాళి అమ్మవార్ల ఘటాల ఊరేగింపు భక్తజనం ఉత్సాహం మధ్య కనుల పండువగా జరిగింది. పాతనగరంలోని ప్రధాన ఆలయాల నుంచి అమ్మవార్ల ఘటాలు చార్మినార్ కేంద్రంగా నయాపూల్ ఢిల్లీ దర్వాజ వరకు ఊరేగింపుగా కొనసాగాయి. లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయ అధికారిక పోతురాజు అశ్వీన్ ఊరేగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంబరీపై శ్రీ అక్కన్నమాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకోచ్చిన 35 ఏళ్ల ఏనుగు(లక్ష్మీ)అంబరీపై అమ్మవారి ఘటం ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మాతంగి అనురాధ లాల్‌దర్వాజ ఆలయం వద్ద భవిష్యవాణి (రంగం) వినిపించారు. వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.