Congress Party | మేడ్చల్, జూలై 15 (నమస్తే తెలంగాణ): అల్వాల్‌లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు భౌతిక దాడులకు దిగారు. ఆడ, మగ తేడా లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు ఉద్రిక్తత పరిస్తితులకు దారి తీసింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో హస్తం మూకలు మరింత రెచ్చిపోయారు.
మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ సర్కిల్లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మంగళవారం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపైకి ప్రొటోకాల్ ప్రకారం మహిళా కార్పొరేటర్లను ఆహ్వానించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి బీర్ల ఐలయ్యకు సూచించారు. అంతలోనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జ్యనానికి దిగారు.
ఈ క్రమంలో గౌతమ్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత భర్త రాముయాదవ్పై కాంగ్రెస్ నేత లక్ష్మీకాంత్‌రెడ్డి చేయిచేసుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పై కూడా వాటర్ బాటిళ్లతో దాడికి యత్నించారు. అయితే ఎమ్మెల్యే గన్‌మెన్ వారిని అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ చెక్కులను పూర్తిగా అందించకుండానే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత భర్త రాముయాదవ్పై కాంగ్రెస్ నేతలు చేసిన దాడి సంఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం తమపై బీఆర్ఎస్ కార్యకర్తులు దాడిచేశారంటూ ప్రతి ఫిర్యాదు చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగారెడ్డి మాట్లాడుతూ.. అల్వాల్‌లో జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పరిలీస్తున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం.
అల్వాల్, జూలై 15: రాజకీయాల్లో సంక్షేమం, అభివృద్ధి విషయమై నాయకులు పోటీ పడాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి మాట్లాడారు. బోనాల పండుగకు ఆలయాలకు ఇచ్చే రూ.69 లక్షల స్థానంలో కోటి ఇరవై లక్షలకు పెంచేవిధంగా ప్రభుత్వంపై పోరాడాలని తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా.. కాంగ్రెస్ నేతలు అగౌరవంగా మాట్లాడడం కార్పొరేటర్ భర్త పై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. కాంగ్రెస నేతల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కార్పొరేటర్లు చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్, మేకల సునీత రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.