ఖైరతాబాద్, సెప్టెంబర్ 1 : స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ‘స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్…అస్థిత్వం- నేటి సవాళ్లు-పరిషారం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగపూర్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తరహాలో రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే దాని పరిధి, అధికారాలు, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ మధ్య స్పష్టమైన న్యాయపరమైన విభజన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
తాను పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే సాంకేతిక, నైపుణ్య విద్యా వ్యవస్థలపై అధ్యయనం చేశానని పేరొన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఉన్నప్పటికీ, డిప్లొమా కోర్సులను నిర్వహించేందుకు సంబంధిత సాంకేతిక విద్యా నిబంధనలు, ఏఐసీటీఈ అనుమతులు అవసరమని తెలిపారు. అలాంటి అనుమతులు, చట్టపరమైన అంశాలను స్పష్టంగా పరిష్కరించకుండానే దశాబ్దాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయడం సరైన నిర్ణయం కాదని, ఈ అంశం న్యాయపరమైన చికులకు దారితీసే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు కేవలం ఒక నిర్దిష్ట వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకునే వారు కాదని, సాంకేతిక విద్యలో శిక్షణ పొంది టెక్నోక్రాట్లుగా ఎదిగే అవకాశాలను పొందుతున్నారని వివరించారు.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ విద్యలైన పంబ్లింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రిషియన్ వంటి నిర్దిష్ట వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాయని పేరొన్నారు. ఈ రెండు విద్యా విధానాలను ఒకే వ్యవస్థగా చూడటం వల్ల పాలిటెక్నిక్ విద్య లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో సరైన స్థాయిలో అడ్మిషన్లు పొందలేకపోతున్న సిల్ యూనివర్సిటీకి పాలిటెక్నిక్ కళాశాలలను అనుసంధానం చేయడం సమంజసం కాదని విమర్శించారు.
జీఓ 97లోని ముఖ్యంగా క్లాజ్ 4 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల అనుసంధానానికి సంబంధించిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ , కేశవరావు కమిటీలు పాలిటెక్నిక్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను నేరుగా సేకరించి, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం నివేదిక సమర్పించాలని ఆయన కోరారు.
ఇదే సమయంలో శాంతియుతంగా తమ హక్కుల కోసం నిరసనలు చేపడుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు విధించడం సరికాదని రాష్ట్ర డీజీపీ ఆనంద్ కు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హకును వినియోగించుకుంటున్న విద్యార్థులను వేధించకుండా, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించాలని కోరారు.
అలాగే లేబర్ డిపార్ట్ మెంట్ పేరును ‘శక్తి’గా మార్చడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కార్మిక శాఖ పేరులోనే కార్మిక వర్గ గౌరవం, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్ ’, ట్రేడ్ యూనియన్ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబిస్తాయని పేరొన్నారు. అందువల్ల కార్మిక శాఖ పేరును యథాతథంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా, భవిష్యత్ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.