Amberpet Flyover | అంబర్‌పేట, ఆగస్టు 8: అంబర్‌పేట ఛే నంబర్ ఫ్లై ఓవర్‌కు సంబంధించి గోల్నాక మసీదు-ఏ-మహ్మద్ ఇస్మాయీల్ వద్ద సర్వీస్ రోడ్డు పనులను పక్కన పెట్టి ముందు ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేయండని వక్ష్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లాఖాన్ సంబంధిత అధికారులకు చెప్పారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం..దాని పక్కన నిర్మించే సర్వీసు రోడ్డు వల్ల స్థానికంగా ఉన్న మసీదు, అక్కడ ఉన్న గ్రేవ్ యార్డుకు నష్టం వాటిల్లుతుందనే పుకార్లు షికార్లు చేయడం, అక్కడ కొందరు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఆపేయడంతో విషయాన్ని తెలుసుకున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ గురువారం ఇక్కడకు వచ్చారు. దీంతో ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు కూడా వచ్చారు. మసీదుకు సంబంధించి అఫ్జల్, సల్వా గార్డెన్‌కు సంబంధించి మున్వర్లు విషయాన్ని వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు తెలిపారు.
అదే విధంగా సర్వీసు రోడ్డు నిర్మాణానికి అడ్డుగా వస్తున్న గ్రేవ్ యార్డుపై నుంచి చిన్న ర్యాంపు వంటిది ఏర్పాటు చేయాలని కోర్టు తీర్పును కూడా ఆయన దృష్టికి తెచ్చారు. అన్ని విషయాలు తెలుసుకున్న అజ్మతుల్లాఖాన్ ముందు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులకు చెప్పారు. సర్వీసు రోడ్డుతో వస్తున్న ఇబ్బందులను తర్వాత చర్చిద్దామన్నారు. దానికి ఉన్నత స్థాయిలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. మసీదు, గ్రేవ్ యార్డుకు ఎలాంటి నష్టం జరగకుండా నిర్మాణం జరుగుతుందని, పనులు ఏవీ కూడా ఆపొద్దని పేర్కొన్నారు.