దుండిగల్, నవంబర్ 9: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో హత్యకు గురైన మహిళ శారద కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హంతకుడు తెలివిగా మృతురాలి చెవి కమ్మలు, ముక్కుపుడకను అపహరించి దోపిడీ కోసమే హత్య చేసినట్లు పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి నుంచి అసలు విషయం రాబట్టారు. తమ మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుండటంతోనే మహిళను హతమార్చాల్సి వచ్చిందని నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి శనివారం దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
డీసీపీ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన ఎ.గంగన్న కొడుకు ప్రవీన్‌కుమార్(36) గత దశాబ్దంన్నర కాలంగా స్థానికంగా సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బొద్దుల శారద(50)అనే మహిళ తరచూ సెల్‌ఫోన్ షాపునకు వస్తుండటంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో తరచూ ఇద్దరు శారీరకంగా కలుస్తుండే వారు. ఈ క్రమంలో 2020లో శారద తన కొడుకుతో కలిసి నగరానికి వలస వచ్చింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్, శ్రీవంశీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటుంది. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. శారద స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద శ్రీవిఘ్నేశ్వర స్టాల్ పేరిట మిల్క్‌బూత్ నడుపుతున్నది.
అయినప్పటికీ శారద, ప్రవీన్‌కుమార్ క్రమం తప్పకుండా సెల్లో వాట్సాప్ కాల్ చేసుకుంటుండే వారు. అయితే ఏడాది కిందట తనకు రూ.2లక్షలు కావాలని, ఇవ్వకుంటే ఇద్దరి మధ్య ఉన్న అక్రమ బాగోతాన్ని బయటపెట్టి బజారుకీడుస్తానని శారద ప్రవీన్కుమార్ను భయపెట్టింది. అవసరమైతే పోలీసు కేసు పెడుతానని హెచ్చరించింది. దీంతో హడలిపోయిన ప్రవీన్‌కుమార్ చేసేదిలేక శారదకు రూ.2లక్షలు ఇచ్చాడు. అయితే ఎప్పటికైనా శారదతో ప్రమాదమని గ్రహించిన ప్రవీన్‌కుమార్ ఆమె సెల్ఫోన్లో సన్నిహితంగా ఉన్న తమ వీడియోలు, ఫొటోలను తొలగింపజేయాలనుకున్నాడు.
వినని పక్షంలో అంతం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా రెండు నెలల కిందట శారదకు ఫోన్ చేయగా.. తన వద్దకు(మల్లంపేట్)కు రావాలని చెప్పింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన మల్లంపేట్‌కు వచ్చిన ప్రవీన్‌కుమార్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి నేరుగా శారద నడుపుతున్న మిల్క్‌బూత్ వద్దకు వెళ్లాడు. అక్కడ షాపు కట్టేసి ఇద్దరు కలిసి అపార్ట్మెంట్లోని శారద ఫ్లాట్‌కు వచ్చారు. అనంతరం తన ఫొటోలు, వీడియోలు సెల్‌ఫోన్ నుంచి డిలీట్ చేయాలని కోరగా.. శారద మళ్లీ తనకు కొంత మొత్తం డబ్బులు ముట్టజెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. పధకం ప్రకారం ప్రవీన్‌కుమార్ శారద గొంతు నులిమి హతమార్చాడు.
అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు, ముక్కు పుడకను ఎత్తుకెళ్లాడు. ప్రవీన్‌కుమార్ హత్య కేసు ఆధారాలు దొరక్కుండా విఫలయత్నం చేసినప్పటికీ పోలీసులు కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. సుమారు 50-60 సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితుడిని గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం వైద్య పరీక్షల కోసం నిందితుడు ప్రవీన్‌కుమార్ సికింద్రాబాద్‌కు రాగా, సాంకేతికత సాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు శారదను హత్య చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో ప్రవీన్కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను, ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, దుండిగల్ సీఐ సతీశ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీశ్‌తోపాటు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.