బడంగ్ పేట, మార్చి 29: మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీగా పెరిగిన ఆస్తి పన్నులను తగ్గించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాల మేరకు మీర్ పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు శనివారం సీడీఎంఏకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామేష్‌రెడ్డి మాట్లాడుతూ మీర్ పేట కార్పొరేషన్ కమిషనర్‌కు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చామని, త్వరలో ఆస్తి పన్ను సమస్యను పరిష్కరిస్తామని అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.
ఎమ్మెల్యే స్వయంగా ఫోన్లు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఆస్తి పన్ను తగ్గించాలని అనేక సార్లు అధికారులకు చెబుతూనే వస్తున్నారన్నారు. ఏ రోజు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోని బీజేపీ నాయకులు.. ఆస్తి పన్ను తగ్గిస్తే బీఆర్ఎస్కు ఎక్కడ పేరు వస్తుందోనని.. రాజకీయ ఉనికి కోసం రిలే నిరాహార దీక్షలకు దిగారని, వారి నిరసనకు కాలనీవాసుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.